సాక్షి, విజయవాడ : విజయవాడ అర్బన్ మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అభ్యంతరం తెలిపారు. తనకు అనుకూలంగా ఉన్న డివిజన్లు తన మండల పరిధిలోనే ఉంచాలంటూ ఆయన అధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయితే, ఎమ్మెల్యే ప్రతిపాదనను పరిశీలించాక విభజనపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే కోరినట్టు మారిస్తే మండలాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
జనాభా, డివిజన్ల ఆధారంగా..
విజయవాడ నగరంలో 59 డివిజన్లు, జనాభాను దృష్టిలో పెట్టుకుని అధికారులు నాలుగు మండలాలను రూపొందించారు. నగరంలోని 10.50 లక్షల జనాభా నాలుగు మండలాలకు సమానంగా సరిపోయేలా కొన్ని డివిజన్లను విభజించారు కూడా. ఒక్కో మండల కార్యాలయ పరిధిలో 14 డివిజన్లు ఉండేలా నోటిఫికేషన్ తయారుచేశారు. ఈ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు కోరారు. దీనిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
నాలుగు.. మూడయ్యే అవకాశం
జలీల్‌ఖాన్ కోరినట్టుగా ఉత్తర మండల పరిధిలోని మూడు డివిజన్లు పశ్చిమ మండలంలోకి మారిస్తే పశ్చిమ మండలంలో జనాభా ఎక్కువవుతారు. ఉత్తర మండలంలో జనాభా తగ్గుతారు. కనీసం ఐదారు వేల మంది తగ్గితే ఉత్తర మండలాన్ని తీసివేసి మిగిలిన డివిజన్లను పశ్చిమ, సెంట్రల్, తూర్పు డివిజన్లలో కలిపేయాల్సి ఉంటుంది. ఎక్కువ మండల కార్యాలయాలు ఉంటే ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చు. కార్యాలయం ఆయా డివిజన్ వాసులకు అందుబాటులో ఉంటుంది. అధికారులపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. నాలుగు మండలాలకు బదులుగా మూడు ఏర్పాటుచేస్తే ఇబ్బందులు పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment