
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు రాబోతున్నాయి. ఒకప్పుడు 57 మండలాల సువిశాల జిల్లాగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ తరువాత నాలుగు కొత్త జిల్లాలుగా ఆవిర్భవించింది. మరో మూడుజిల్లాల్లోనూ పాత మండలాలు కలిశాయి. మొత్తానికి జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో కేవలం 16 మండలాలతో చిన్న జిల్లాగా కరీంనగర్ ఆవిర్భవించింది. చాలాకాలంగా కొన్ని గ్రామాలను మండలాలుగా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇటీవల సర్వే కూడా ప్రారంభించింది.
చల్లూరు (వీణవంక), వావిలాల (జమ్మికుంట), గర్షకుర్తి (గంగాధర), గోపాలరావుపేట (రామడుగు), రేణికుంట (తిమ్మాపూర్) (పర్లపల్లి లేదా నుస్తులాపూర్‌ను సైతం పరిశీలిస్తున్నారని సమాచారం) గ్రామాలను కొత్త మండలాల కోసం గురువారం సర్వే నిర్వహించారు. గ్రామాల మ్యాప్‌లతో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా అధికారులకు అందజేసినట్లు తెలిసింది. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జగిత్యాలలో రాజారాంపల్లి
జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారాంపల్లి– ఎండపెల్లి గ్రామాలను కలిపి మండలకేంద్రంగా చేయాలని ప్రతిపాదనలను తాజాగా రెవెన్యూ అధికారులు పంపారు. ఇందుకోసం ధర్మారం మండలంలోని మూడు గ్రామాలను విలీనం చేసేందుకు గతంలోనే గ్రామపంచాయతీలు తీర్మానం కూడా చేశాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని, ఆగస్టు 15 నాటికి ప్రతిపాదనలకు సంబంధించిన మండలాలపై అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ కొత్త మండలాల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కాకతీయ ఉత్సవాలు అద్భుతం!)
Comments
Please login to add a commentAdd a comment