
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఖరారు కాలేదు. అయితే ఈ రెండు పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై రభస జరుగుతోంది. ఆ సీటు తమదేనంటూ టీడీపీలో నలుగురు నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు. మరోవైపు పశ్చిమ సీటు తమదేనంటూ జనసేన పార్టీ నాయకులు కూడా ప్రకటనలు ఇస్తూ మరింత రచ్చచేస్తున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
పెరుగుతున్న దూరం
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేనకు కేటాయిస్తారన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయితే కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు సీటు విషయంలో ఎవరికి వారు తమదేనంటూ బహిరంగ వేదికలపై పోటీపడి ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం ఆ రెండు పార్టీల నేతల మధ్య దూరం పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు సన్నాహాలు పూర్తి స్థాయిలో ప్రారంభంకాక ముందే ఈ విధమైన గలాటాలు ఆ పార్టీ శ్రేణులను గందర గోళానికి గురిచేస్తున్నాయి.
ఇరు పార్టీల్లోనూ అయోమయం
తెలుగుదేశం, జనసేన పార్టీల రెండిటిల్లోనూ గందరగోళనం నెలకొంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ బహిరంగంగా సీట్లు తమవేనంటూ ప్రకటించి హడావుడి చేయటం, జనసేన ప్రచారం చేపట్టడంతో రెండు పార్టీల్లోనూ ఏమిటీ పరిస్థితి అంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా పొత్తుపొడవక ముందే ఆ రెండు పార్టీల్లోనూ అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీలో నాలుగు స్తంభాలాట
పశ్చిమ తెలుగుదేశం పార్టీలో నాలుగు స్తంభా లాట కొనసాగుతోంది. ఆ పార్టీ నేతలు ఎవరికి వారు సీటు తమదేనంటూ బహిరంగ సభల్లోనే ప్రకటించి అలజడి సృష్టి చేస్తున్నారు. రెండు మాసాల క్రితం ఆ పార్టీ నేత ఎంఎస్ బేగ్ పుట్టిన రోజు వేడుకలు స్థానిక పంజా సెంటర్‌లో జరిగాయి. ఆ క్రమంలో ఆ సభకు హాజరైన ఎంపీ కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ బేగ్ పోటీ చేస్తాడని, అతడిని ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేసి ఆ పార్టీలో అలజడి లేపారు. ఇక మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రెండు రోజుల క్రితం తన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఆ సభలో టీడీపీ పశ్చిమ సీటు తనదేనని, కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని జలీల్‌ఖాన్ ప్రకటించారు. ఆ మరుసటి రోజే మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పశ్చిమ నుంచి టీడీపీ బీసీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని, ఒక వేళ మైనార్టీకి సీటు కేటాయిస్తే నాగుల్‌మీరా బరిలో ఉంటారని ప్రకటించారు. జలీల్‌ఖాన్ వ్యవహారంపై తాను స్పందించనని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వీరితో పాటుగా మరి కొంత మంది సైతం టీడీపీ సీటు తమదే నంటూ హడావుడి చేస్తున్నారు.
జనసేన పార్టీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ పోతిన మహేష్ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి సైతం అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో సీటు తమకే కేటాయిస్తారంటూ ప్రకటిస్తూ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తీరు చూస్తుంటే జనసేనకు పశ్చిమంలో ఝలక్ ఇవ్వటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.