జనసేన అతిచేష్టలు.. గద్దె రామ్మోహనరావు అసహనం | - | Sakshi
Sakshi News home page

జనసేన అతిచేష్టలు.. గద్దె రామ్మోహనరావు అసహనం

Published Wed, Dec 20 2023 1:48 AM | Last Updated on Wed, Dec 20 2023 1:57 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే సీట్ల విషయమై తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పేచీ మొదలైంది. పొత్తు ఖరారై, సీట్ల పంపిణీ జరగక ముందే రెండు పార్టీల మధ్య తలెత్తిన విభేదాలు ఆ పార్టీల శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ తూర్పు, పశ్చిమం, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గాల్లో ఏవైనా మూడింటిని తమకు కేటాయించాలని జనసేన పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు సీట్లకు తగ్గేదిలేదని భీష్మించారని సమాచారం. అదే జరిగితే ఆ రెండు సీట్లతో పాటు, విజయవాడ ఎంపీ సీటుపైనా పూర్తిగా ఆశలు వదులుకోకతప్పదన్న భావనలో టీడీపీ ఉంది. లోకేష్‌ పాదయాత్ర ముగిసిన తరువాత ఆయన్ను, చంద్రబాబును కలిసి విజ యవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఏ ఒక్క ఎమ్మెల్యే సీటునూ జనసేనకు ఇవ్వడానికి వీలులేదని ఒత్తిడి చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించారని సమాచారం.

ముదురుతున్న వైరం
విజయవాడలో పవన్‌కల్యాణ్‌ సామాజికవర్గానికి రాజకీయంగా పట్టు దొరికితే, తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలకు విఘాతమని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అనివార్యమైతే ఒకటి, రెండు సీట్లు జనసేనకు ఇచ్చినా, ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని టీడీపీ ధ్యేయంగా పెట్టుకొంది. జనసేనకు, ఆ పార్టీకి దన్నుగా ఉన్న సామాజికవర్గానికి ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండా చేయాలన్నదే టీడీపీ ఎత్తు గడ. ఈ విషయం బయటకు పొక్కడంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీట్ల వ్యవహారంపై తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య వైరం ముదురుపాకాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్తబ్దుగా టీడీపీ
జిల్లాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో కాడిపడేటం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు నియోజకవర్గంలో పర్యటించకుండా స్తబ్దుగా ఉండిపోయారు. తనకు టికెట్‌ వస్తుందా? రాదా? అనే మీమాంశతో సతమతం అవుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీ టికెట్‌ విషయాన్ని ఎటూ తేల్చకపోవడంతో పార్టీ అధిష్టానంపైనా గుర్రుగా ఉన్నారు.

తనకు ఎంపీ టికెట్‌ ఇవ్వని పక్షంలో తన కుమార్తెకు విజయవాడ పార్లమెంటరీ పరిధిలో ఓ అసెంబ్లీ స్థానం కేటాయించాలని పట్టుబడుతున్నారని తెలిసింది. మరోవైపు తన తమ్ముడు కేశినేని చిన్నికి ఎంపీ టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని కేశినేని నాని షరతు విధించడంతో ఎటూ పాలుపోక చంద్రబాబు తలపట్టుకున్నట్లు పార్టీ శ్రేణుల్లోనే చర్చ సాగుతోంది. జనసేనతో పొత్తు తలనొప్పితో పాటు సొంత పార్టీలో నెలకొన్న అసంతృప్తులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సైతం టీడీపీ వర్గాలు స్తబ్దుగా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ రాజకీయ కార్యకలాపాలు చల్లబడ్డాయి. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఆ రెండు పార్టీలకు కొమ్ముకాస్తున్న సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారుతున్నాయి.

అభ్యర్థులు లేకుండానే..
జనసేన తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేకుండానే మూడు సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు పట్టుపట్టడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన విజయవాడ తూర్పు సీటు కావాలని జనసేన పట్టుబట్టడంపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగు తోంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే నలుగురు అభ్యర్థులు ప్రకటించారు. టీడీపీ నాయకుల తీరును ఆ సీటును ఆశిస్తున్న జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. మొత్తం మీద జనసేన, టీడీపీ మధ్య సీట్ల పొత్తు పొడవక ముందే విభేదాలు తీవ్రమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement