నేడు కీలక భేటీ
నేడు కీలక భేటీ
Published Thu, Aug 11 2016 10:28 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
సాక్షిప్రతినిధి నిజామాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మంత్రి వర్గ ఉప సంఘం భేటీకానుంది. ఇందులో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చర్చించనున్నారు. ఇదివరకే నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి పలు అంశాలను జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు. కొత్త మండలాల ఏర్పాటు, ప్రాంతాలు, అధికారులు, ఉద్యోగుల విభజన తదితర విషయాలను చర్చించనున్నారు. ఇదివరకే జిల్లా కలెక్టర్ యోగితారాణా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా నివేదికపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్దగా ఎదురయ్యే ఆటంకాలు లేవని చెప్పుకోవాలి.అయితే మండలాల ఏర్పాటు ప్రాంతాల విభజనకు సంబంధించి కొన్ని వినతులను, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని చర్చించనున్నారు. జిల్లాలో కొత్తగా 10 మండలాలు పెరుగనున్నాయి. కొత్త మండలాల విలీనంపై స్పష్టత వచ్చింది. 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలతో కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని నాగిరెడ్డిపేట మండలంను మెదక్ జిల్లాలో కలుపుతున్నట్లు ప్రచారం జరిగింది. కొత్తగా కామారెడ్డిలో మరో మండలం ఏర్పాట్లు అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా బాన్సువాడ నియోజక వర్గ పరిధిలోని కోటగిరి, వర్ని మండలాలు నిజామాబాద్ జిల్లాలో కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించే అవకాశం ఉంది. ఇదివరకే మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ రెండు మండలాలను నిజామాబాద్ జిల్లాలో కలుపనున్నట్లు హామీ ఇచ్చారు. అయినా మంత్రి వర్గ ఉపసంఘం కీలక సమావేశం కాబట్టి ఇందులోనే ఈ రెండు మండలాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం మేరకు రెండు జిల్లాల్లో మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉంటాయోనని ఈ సమావేశంలో తేలనున్నది. కొన్ని రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఏర్పాటుపై సందేహాలకు సైతం ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని అంశాలు..
జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఉద్యోగుల విభజన, తాత్కాలిక ఏర్పాట్లు, వసతి, మౌలిక ఏర్పాట్లు, జోనల్ శాఖల పునర్‌వ్యవస్థీకరణ పై ఈ కమిటీ చర్చించనుంది. ముసాయిదాకు ముందే దీనిపై తుది నిర్ణయం తీసుకొని నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో పునర్విభజన ప్రక్రియకు సంబంధించి నివేదికలను మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలించనుంది. అలాగే మంత్రి, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, పోలీసు శాఖకు సంబంధించి అభిప్రాయాలను పరిశీలించనున్నారు. ఇదివరకే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు, పరిపాలనకు సంబంధించి భవనాల పరిశీలన చేశారు. కార్యాలయాలకు భవనాలను కూడా ఎంపికచేశారు. జిల్లా పరిపాలన వ్యవస్థ పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించి అన్ని వివరాలను ఇదివరకే జిల్లా కలెక్టర్ యోగితారాణా నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేయనుంది. అలాగే కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ అర్బన్, రూరల్‌లో రుద్రుర్, కామారెడ్డి అర్బన్‌లో తోడు ఆలూరు, భిక్కనూరు మండలం రాజాంపేట, దోమకొండ మండలం బీబీపేటలు మండలాలుగా ఏర్పడే అవకాశం ఉంది. దీనికి తోడు డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి కొత్త మండలం ఏర్పాటుపై పరిశీలించనున్నారు. జనాభా ప్రతిపాదికన కూడా విభజన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈనెల 22న ముసాయిదాలో తుది నిర్ణయం తీసుకొని నివేదిక పొందుపరచనున్నారు. అందుకుగాను నేడు కీలక సమావేశం జరుగనుంది. జిల్లా కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ విశ్వప్రసాద్ సైతం ఈ సమావేశంలో పాల్గొని నివేదికలు ఇవ్వనున్నారు. నేడు సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా జరుగుతున్న పునర్విభజన సందేహాలకు బ్రేక్‌పడనుంది. మంత్రి వర్గ ఉపసంఘం నిజామాబాద్‌లోని కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దీంతో దసరా నుండి కొత్త జిల్లాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Advertisement