కొత్త మండలాలపైనే ఫోకస్ | 70-80 మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు | Sakshi
Sakshi News home page

కొత్త మండలాలపైనే ఫోకస్

Published Wed, Jun 8 2016 3:35 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

కొత్త మండలాలపైనే ఫోకస్ - Sakshi

కొత్త మండలాలపైనే ఫోకస్

  • కలెక్టర్ల సదస్సులో తొలిరోజు వీటిపైనే చర్చ
  • కొత్త జిల్లాలకు పరిధి ఖరారు..
  • చుట్టూ 65-70 కి.మీ. మించకుండా జిల్లాల పునర్విభజన
  • జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా హద్దుల గుర్తింపు
  • మ్యాప్‌లు, ముసాయిదాలను ప్రజెంట్ చేసిన కలెక్టర్లు
  • నేడు ముఖ్యమంత్రి, సీఎస్ ఆధ్వర్యంలో తుది కసరత్తు
  •  
     సాక్షి, హైదరాబాద్:  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 23 లేదా 24 జిల్లాలుగా పునర్విభజన చేసేందుకు తుది కసరత్తు చేసింది. ఒక్కో జిల్లా కేంద్రం నుంచి ఆ జిల్లా పరిధి 65-70 కిలోమీటర్ల దూరం మించకుండా ఉండేలా పునర్విభజన జరగాలని దిశానిర్దేశం చేసింది. అదే ప్రధాన గీటురాయిగా ఏయే మండలాలను ఎందులో కలపాలన్న ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. దీంతో సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు సైతం జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటుందని, అన్ని మండలాలకు పరిపాలన సౌలభ్యం ఉంటుందని నిర్దేశించింది.

    ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనను సైతం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన రెండ్రోజుల వర్క్‌షాప్ మంగళవారం ఉదయం ఎంసీహెచ్‌ఆర్‌డీలో ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా తొలిరోజు సదస్సును ప్రారంభించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితర అధికారులు సదస్సులో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం తిరిగి వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సాయంత్రం సదస్సుకు హాజరయ్యారు. ఇప్పటికే నిర్దేశించిన విధివిధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు సమర్పించిన కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాల ప్రతిపాదనలపై ఈ సందర్భంగా ప్రధాన చర్చ జరిగింది.


     జిల్లాల వారీగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
     మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తమ ప్రతిపాదనలు, మ్యాప్‌లతో సహా కలెక్టర్లు విశ్లేషించారు. జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏయే మండలాలు ఏయే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలి.. జిల్లా సరిహద్దులు ఎలా ఉండాలి.. ఏయే మండలాలను ఏ జిల్లాలో చేరిస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్న వివరాలను ప్రదర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధితోపాటు అందులో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు, మండలాల హద్దులపై సమగ్ర నివేదికలు సమర్పించారు. తొలిరోజు సదస్సులో కొత్త రెవెన్యూ మండలాల ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.

    జనాభా, మండల పరిధి, భౌగోళిక స్వరూపం, రవాణా సదుపాయాలను బట్టి కొత్త మండలాల కసరత్తు జరగాలని నిర్ణయం తీసుకున్నారు. జనాభా, వైశాల్యం, పట్టణాలకు ఆనుకొని ఉన్న మేజర్ గ్రామాలు.. వీటన్నింటిని పరిశీలించి రాష్ట్రంలో దాదాపు 70-80 కొత్త మండలాలు ఏర్పాటు కానున్నట్లు కలెక్టర్లు ఇచ్చిన నివేదికలతో లెక్క తేలింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మండలాలకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పెద్ద పట్టణాల్లో అర్బన్, రూరల్ మండలాల ప్రతిపాదనలు అన్ని జిల్లాల నుంచి అందాయి. మండల కేంద్రానికి గ్రామాల దూరం ఎక్కువగా ఉండకుండా నిర్ణీత పరిధి ఉండేలా చూడాలని సీసీఎల్‌ఏ.. కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా భూపరిపాలన, రెవెన్యూ అధికారులు ముందే రూపొందించిన ప్రశ్నావళిని కలెక్టర్లకు అందజేశారు. వాటికి సంబంధించి అధికారులు రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా తమ జిల్లాల సరిహద్దులో ఉండి.. ఇతర జిల్లాల్లో విలీనమయ్యే గ్రామాలు, రెవెన్యూ సరిహద్దులను ఎలా సవరించాలనే అంశంపై వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా మండలాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్ల పరిధి, అధికార వికేంద్రీకరణతో పాటు కావాల్సిన సిబ్బంది, అధికారుల సంఖ్యతో కూడిన వివరాలను సైతం అందించారు.
     
     జీఐఎస్ మ్యాపింగ్‌తో కసరత్తు
     భూపరిపాలన విభాగం సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మండలాలు, కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్(జీఐఎస్) ద్వారా శాస్త్రీయంగా కసరత్తు చేసింది. దీంతో ఏ కేంద్రం నుంచైనా 65-70 కిలోమీటర్ల పరిధిలో చుట్టూరా సరిహద్దు గీయటం.. ఆ పరిధిలో ఏయే ప్రాంతాలున్నాయి? ఎంత జనాభా ఉంది? ఏయే మండలాలు ఆ పరిధిలో ఉన్నాయి? సరిహద్దుల్లో ఉన్న మండలాలను ఎందులో కలపాలనేది అప్పటికప్పుడే చూపించింది.

    కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనలను తమ దగ్గరున్న జీఐఎస్ మ్యాపింగ్‌తో చేసిన నమూనా మ్యాప్‌లను సరిపోల్చి సలహాలు సూచనలు చేసింది. నదులు, వాగులు, వంకలున్న చోట జీఐఎస్ మ్యాపింగ్‌కు, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులకు తేడాలుంటాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లాల సరిహద్దులను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా వస్తున్న డిమాండ్లను సీఎంకే వదిలేయాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనున్నారు. జిల్లాలకు సంబంధించిన మరింత స్పష్టతను ఇచ్చేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు సీఎస్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement