20 మండలాలకో జిల్లా | each district for 20 mandals | Sakshi
Sakshi News home page

20 మండలాలకో జిల్లా

Published Thu, Jun 9 2016 2:26 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

20 మండలాలకో జిల్లా - Sakshi

20 మండలాలకో జిల్లా

  • కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
  •   దసరా నాడే కొత్త జిల్లాలు కొలువుదీరాలి
  •   40 వేల నుంచి 50 వేల జనాభాతో ఒక మండలం ఉండాలి
  •    జిల్లాల కసరత్తులో ప్రస్తుత నియోజకవర్గాలను పట్టించుకోకండి
  •    ఒత్తిళ్లను పక్కనపెట్టి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి
  •    బలవంతంగా వేరేచోట కలిపారన్న భావన ప్రజల్లో రావద్దు
  •    {పజాభిప్రాయం తీసుకోండి.. ప్రజాప్రతినిధులతో మాట్లాడండి
  •    జిల్లాల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ఖరారు     
  •  

     రోడ్‌మ్యాప్ ఇలా...

     జూన్ 20 లోపు సీసీఎల్‌ఏకు జిల్లా కలెక్టర్ల నివేదికలు

     జూన్ 30లోపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ

     జూలై 5న కలెక్టర్లతో సీఎం సమీక్ష

     జూలై 10 లేదా 11న అఖిలపక్ష సమావేశం

     ఆగస్టు 4-10 జిల్లాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్

     అక్టోబర్ 11న కొత్త జిల్లాల ఆవిర్భావం

     

    సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసింది. దసరా నాటికి కొత్త జిల్లాల ఆవిర్భావం జరుగుతుందని మరోమారు స్పష్టం చేసింది. అదే రోజున జిల్లా కలెక్టర్ సహా జిల్లా యంత్రాంగమంతా బాధ్యతలు స్వీకరిస్తుందని ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. డ్రాఫ్ట్ ప్రకటన జారీ అయిన తేదీ నుంచి నిర్ణీత గడువు (నెల రోజులు) లోపు వచ్చే అభ్యంతరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు క్రోడీకరించి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్మి, సీసీఎల్‌ఏకు అందజేయాలని సూచించింది. వాటిని పరిశీలించిన తర్వాత జిల్లా ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది. అక్టోబర్ 11 (విజయదశమి) నాటికి నూతన జిల్లాల ఆవిర్భవిస్తాయని ప్రకటించింది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో జరిగిన కలెక్టర్ల వర్క్‌షాప్‌లో రెండో రోజైన బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై పలు కీలకమైన నిర్ణయాలను వెల్లడించారు.

    అందుకు సంబంధించి వివిధ దశల్లో అనుసరించేకార్యాచరణ షెడ్యూలును ప్రకటించారు. ‘‘జూన్ 20 లోపు అన్ని జిల్లాల కలెక్టర్లు సమగ్ర నివేదికను సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్‌కు అందజేయాలి. సీసీఎల్‌ఏ, సీఎస్ వాటిని ఫైనలైజ్ చేయాలి. జూన్ 30 లోపు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ, చర్చలు, తదితర రాజకీయ ప్రక్రియను పూర్తి చేయాలి. జూలై 5న కలెక్టర్లతో మరోమారు సమావేశం కావాలి. జూలై 10 లేదా 11 తేదీల్లో ప్రభుత్వం అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు. ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారీ.. జారీ ప్రక్రియ ఉంటుంది..’’ అని సీఎం వెల్లడించారు.

    ‘‘40 వేల నుంచి 50 వేల జనాభాతో ఒక మండలం, సుమారు 20 మండలాలతో ఒక జిల్లా, సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్ మండలాల ఏర్పాటు ఉండాలి. ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నుంచి 6 మండలాలు ఉండేలా కసరత్తు జరగాలి..’’ అంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు, సలహాలు సూచనల ఆధారంగా ఈనెల 20వ తేదీలోపు కలెక్టర్లు సమగ్ర నివేదిక తయారు చేసి సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్‌కు అందజేయాలని ఆదేశించారు.

    ఉద్యోగుల లెక్క తేల్చండి..
    దసరా రోజున కొత్త జిల్లాల్లో కలెక్టర్ సహా యంత్రాంగమంతా కొలువుదీరేలా సన్నాహాలు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రెవెన్యూ తదితర ప్రభుత్వ విభాగాలు, వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను అన్ని విభాగాల నుంచి ఈ నెల 20లోపే తెప్పించుకోవాలని, ఫర్నీచర్, వాహనాలు, బిల్డింగుల వివరాలను నేరుగా సంబంధిత అధికారులతో మాట్లాడి తెలుసుకోవాలన్నారు. ‘‘జిల్లా కార్య నిర్వహణ యంత్రాంగం పనితీరును పరిశీలించాలి.  జేసీలు, డీఆర్‌వోలు, పీడీలు, పీవోలు, ఈడీ, డీడీ తదితర ఉన్నతాధికారులు, వారి కింద పని చేస్తున్న అధికారులు, ఉద్యోగుల వివరాలు లెక్క తేల్చాలి. వీరిలో అనుభవం ఉన్నవారిని నూతనంగా ఏర్పడే జిల్లాలకు కేటాయించాలి. అధికారులు తక్కువ సంఖ్యలో ఉంటే పాత జిల్లాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేసుకోవాలి..’’ అని సూచించారు. 20వ తేదీన జరిగే సమావేశానికి ఈ వివరాలన్నీ తీసుకురావాలని కలెక్టర్లకు సూచించారు.

    ప్రజల ఆకాంక్షలు తెలుసుకున్నారా?
    ‘‘మండలాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి? వారితో మాట్లాడారా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించారా?’’ అని సీఎం కలెక్టర్లను ప్రశ్నించారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను దగ్గర్లో ఉన్న మండల కేంద్రంలో కలిపే సందర్భంలో ప్రజాభిప్రాయం ముఖ్యమన్నారు. ‘‘ప్రస్తుతం జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? ఒక నియోజకవర్గం ఒకటికి మించిన జిల్లాల్లో విస్తరించి ఉందా? అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏంటి? అనే విషయాలను సమీక్షించాలి. ఇది పూర్తిస్థాయి మండలాల సంఖ్యను అంచనా వేయడానికి సాధ్యపడుతుంది’’ అని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధిని అందుకుంటేనే తెలంగాణ ప్రగతి సాధ్యమవుతుందని, అభివృద్ధి చేసుకోవాలంటే కఠిన వైఖరితో కార్యాచరణ ఉండాలని స్పష్టంచేశారు.

    ‘‘కింది స్థాయి ఉద్యోగులతో పద్ధతిగా పని చేయించుకోవాలని, అవినీతిని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, జి.జగదీశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్‌రావు, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

     

    ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు
    ‘‘కొత్త జిల్లాల కసరత్తులో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాన్ని పట్టించుకోవాల్సిన అవస రం లేదు. బలవంతంగా తమను ఇతర మం డలాల్లో కలిపారన్న భావన ప్రజలకు రాకుం డా చూడాలి’’ అని సీఎం చెప్పారు. గ్రామాలను వివిధ మండలాలలో కలుపుతున్న, తొలగిస్తున్న సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘‘వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలుండాలి. ముందుగా మీ కసరత్తు పూర్తి చేయండి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కూర్చొని చర్చించి ఓ ఐడియాకు వస్తే అభ్యంతరాల స్వీకరణకు ప్రజా ప్రకటన ఇద్దాం. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ అవుతుంది’’ అని పేర్కొన్నారు.


     కొత్త జిల్లాల డిమాండ్లపై చర్చ
    వివిధ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలం టూ వస్తున్న డిమాండ్లపై సదస్సులో చర్చ జరిగింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. అటవీ ప్రాంతంలో ఉండే మండలాల విషయంలో భౌగోళిక విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, స్వేచ్ఛగా ఆలోచించి జిల్లాలు, మండలాల పునర్విభజనపై నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచిం చారు. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా మారాలన్నారు. మండలాల వ్యవస్థను అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలని, మండ లం కేంద్రంగా జరగబోయే అభివృద్ధిలో కేవలం సాంకేతికతే కాకుండా మానవీయ కోణం ఉండాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement