సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం కానున్నారు. ఈనెల 21న జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనా విధానాలను స్పష్టం చేయడంతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు గాను ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు సీఎంవో వర్గాలు చెపుతున్నాయి.
ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ధరణి పోర్టల్‌పై కీలక సమీక్ష ఉంటుందని, పలు భూ సంబంధిత అంశాలు, జీవో 58, 59 అమలు, ప్రజా వాణి కార్యక్రమం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించడం, గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు కట్టు కునేందుకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాల ఖరారు, రైతు భరోసా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కౌలు రైతుల గుర్తింపు కోసం అనుసరించాల్సిన పద్ధతి.. తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలుస్తోంది.
ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని, వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా నిర్వహించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏయే అధికారులు ప్రజావాణిని ఏయే వారాల్లో నిర్వహించాలనే దానిపై కూడా కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment