చెత్రికి రూ.1.20 కోట్లు
♦ కోటి క్లబ్‌లో లింగ్డో
♦ ఐఎస్‌ఎల్ ఆటగాళ్ల వేలం
ముంబై : ఊహించినట్టుగానే భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌కు చెందిన ముంబై సిటీ ఎఫ్‌సీ ఫ్రాంచైజీ చెత్రిని రూ. 1 కోటీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. చెత్రి కనీస ధర రూ.80 లక్షలుగా ఉంది. అయితే భారత ఫుట్‌బాల్‌లో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న 30 ఏళ్ల చెత్రి కోసం ముంబై, ఢిల్లీ జట్లు మాత్రమే పోటీపడ్డాయి. ఓవరాల్‌గా పది మంది భారత ఆటగాళ్లు ఆక్షన్‌లో పాల్గొన్నారు. అయితే యుగెన్సన్ లింగ్డో, రినో ఆంటోల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దీంతో వారి ధర అనూహ్యంగా పెరిగింది.
ముఖ్యంగా సెంట్రల్ మిడ్‌ఫీల్డర్ లింగ్డో కనీస ధర కేవలం రూ.27.50 లక్షలే అయినా పుణే సిటీ ఎఫ్‌సీ మూడు రెట్లు అధికంగా రూ.1 కోటీ 5 లక్షలు వెచ్చించింది. గత సీజన్ ఐ-లీగ్‌లో తను అద్భుత ప్రదర్శన చేయడంతో ఏకంగా ఆరు జట్లు అతడి కోసం పోటీపడ్డాయి. చివరకు పుణే దక్కించుకుంది. ఇక డిఫెండర్ ఆంటోను డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా రూ.90 లక్షలకు తీసుకుంది. అతడి కనీస ధర అందరికన్నా తక్కువగా రూ.17 లక్షల 50 వేలు. ఇలాగే రూ.39 లక్షల ధర కలిగిన తోయి సింగ్ కోసం కూడా నార్త్ ఈస్ట్ యునెటైడ్, ముంబై జట్లు పోటీ పడినా చెన్నైయిన్ ఎఫ్‌సీ రూ.86 లక్షలకు దక్కించుకుంది. మొత్తంగా ఈ వేలంలో కోల్‌కతా, చెన్నైయిన్, పుణే, ఢిల్లీ జట్లు ఇద్దరు ఆటగాళ్లను, ముంబై, నార్త్ ఈస్ట్ ఒక్కో ఆటగాడిని తీసుకోగా గోవా ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ ఒక్క ఆటగాడిని కూడా గెల్చుకోలేకపోయాయి. అన్ని జట్లు కలిపి వేలంలో రూ.7.22 కోట్లు ఖర్చు చేశాయి.
నా ధరపై సంతృప్తిగానే ఉన్నాను: చెత్రి
వేలంలో తనకు లభించిన ధరపై అసంతృప్తి లేదని స్ట్రయికర్ సునీల్ చెత్రి అన్నాడు. ‘13 ఏళ్లుగా నేను ఫుట్‌బాల్ ఆడుతున్నాను. డబ్బు నాకు తగినంతగా ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదు. ఇప్పటికే ప్రపంచమంతా ఆడాను కానీ ముంబైలో ఆడలేదు’ అని చెత్రి అన్నాడు. మరోవైపు ఇంత తక్కువ ధరకు చెత్రిని కొనుగోలు చేస్తామని అనుకోలేదని ముంబై యజమాని రణబీర్ కపూర్ సంతోషం వ్యక్తం చేశాడు.