‘పృథ్వీ’ మిస్సైల్! | 15-year-old Prithvi Shaw slams superb 546 in Harris Shield match | Sakshi
Sakshi News home page

‘పృథ్వీ’ మిస్సైల్!

Published Thu, Nov 21 2013 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

‘పృథ్వీ’ మిస్సైల్!

‘పృథ్వీ’ మిస్సైల్!

330 బంతుల్లో  546 పరుగులు 85 ఫోర్లు, 5 సిక్సర్లు
 
 సచిన్ టెండూల్కర్‌ను వెలుగులోకి తెచ్చిన హారిస్ షీల్డ్ క్రికెట్ టోర్నీ ద్వారానే బుధవారం మరో క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు. మాస్టర్ రిటైరైన నాలుగు రోజులకే పృథ్వీ పంకజ్ షా అనే 14 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్‌లో ఏకంగా 546 పరుగులు చేశాడు.
 
 ముంబై: సంచలన స్కోర్లకు వేదికగా నిలిచే హారిస్ షీల్డ్ టోర్నీలో బుధవారం పెను సంచలనం నమోదయింది. ముంబైలో స్కూల్ క్రికెట్‌కు పేరుగాంచిన ఈ టోర్నీలో... పృథ్వీ పంకజ్ షా అనే 14 ఏళ్ల కుర్రాడు ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 546 పరుగులు చేశాడు. కేవలం 330 బంతుల్లో 85 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఈ ఘనత సాధించాడు. రిజ్వీ స్ప్రింగ్‌ఫీల్డ్ అనే జట్టు తరఫున సెయింట్ ఫ్రాన్సిస్ డి అసిసి అనే జట్టుపై ఈ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రఖ్యాత ఆజాద్ మైదాన్‌లో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు 92 పరుగులకు ఆలౌటయింది. దీంతో మంగళవారం బ్యాటింగ్ ప్రారంభించిన స్ప్రింగ్‌ఫీల్డ్ జట్టు తరఫున పృథ్వీ తొలిరోజు 166 బంతుల్లో అజేయంగా 257 పరుగులు చేశాడు.
 
 బుధవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించి... మరో 289 పరుగులు బాదాడు. సత్యలక్ష్య్ జైన్ (164)తో కలిసి రెండో వికెట్‌కు 619 పరుగులు జోడించాడు. పృథ్వీ జోరుతో రిజ్వీ స్ప్రింగ్‌ఫీల్డ్ జట్టు 991 పరుగులు చేసింది. దీంతో ఏకంగా 899 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. హారిస్ షీల్డ్ టోర్నీ ద్వారానే ముంబైలో క్రికెటర్లంతా వెలుగులోకి వస్తారు. వినోద్ కాంబ్లితో కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో సచిన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ టోర్నీతోనే. కొంతకాలంగా ముంబై క్రికెట్ వర్గాల్లో పృథ్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ముంబై అండర్-16 జట్టుకు 5.1 అడుగుల ఎత్తున్న పృథ్వీ కెప్టెన్ కూడా.
 
 సచిన్‌నే మెప్పించాడు
 జూనియర్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన పృథ్వీ తన బ్యాటింగ్ నైపుణ్యంతో సచిన్‌ను సైతం మెప్పించాడు. గత ఏడాది ఒకసారి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ కుర్రాడి బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ముగ్దుడైన మాస్టర్... ఏమైనా సహాయం కావాలంటే అడగమని చెప్పి మరి వెళ్లాడు. స్కూల్, క్లబ్ స్థాయిల్లో పృథ్వీ ఎన్నో పరుగులు సాధించాడు. మంచి టెక్నిక్‌తో పాటు అద్భుతమైన టైమింగ్ అతని సొంతం.
 
 గత సీజన్‌లో స్కాలర్‌షిప్ సహాయంతో ఇంగ్లండ్ వెళ్లి గ్లౌస్టర్‌ైషైర్ కౌంటీలో శిక్షణ తీసుకుని, అక్కడ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.  అక్కడ 85 సగటుతో 1500 పరుగులు చేశాడు. 65 వికెట్లూ పడగొట్టాడు. జూనియర్ క్రికెట్‌లో ఇప్పటికే 4 డబుల్ సెంచరీలూ నమోదు చేశాడు. 2012 హారిస్ షీల్డ్ టోర్నీలో అత్యధికంగా 174 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అదే అతని ఉత్తమ ప్రదర్శన.
 
  రికార్డులు
 స్కూల్ క్రికెట్‌లో 500పైగా వ్యక్తిగత స్కోరు రావడం దేశంలో ఇదే తొలిసారి. భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ పేరిట స్కూల్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు (498 పరుగులు; 2010లో) ఉంది. దీనిని అధిగమించాడు.
 
 భారత్‌లో ఏదైనా పోటీ క్రికెట్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1933-34 సీజన్‌లో దాదాభాయ్ హవేవాలా అనే క్రికెటర్ 515 పరుగులు చేశాడు. బీబీ అండ్ సీఐ రైల్వేస్ జట్టు తరఫున సెయింట్ జేవియర్ కాలేజి జట్టుపై హవేవాలా ఈ స్కోరు చేశాడు.ప్రపంచ వ్యాప్తంగా పోటీ క్రికెట్‌లో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1899లో ఇంగ్లండ్ ఏఈజే కొలిన్స్ అనే క్రికెటర్ అజేయంగా 628 పరుగులు చేశాడు. ఆ తర్వాత 1901లో సీజే ఈడీ 566 పరుగులు చేశాడు.
 
 నాన్నే.. అన్నీ
 పృథ్వీ నాలుగేళ్ల వయసులో అతడి తల్లి మరణించింది. అప్పటి నుంచి తండ్రి పంకజ్ షా ఈ కుర్రాడి బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు. వ్యక్తిగత కోచ్ రాజు పాఠక్... పృథ్వీ కెరీర్‌ను తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆర్థికంగా మరీ పేద కుటుంబం కాదు. తండ్రి పంకజ్ షా బట్టల వ్యాపారం చేస్తారు.
 
 కానీ పృథ్వీ తన టాలెంట్‌తోనే పలు సంస్థల నుంచి స్కాలర్‌షిప్‌లు సంపాదించుకుంటూ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఎనిమిదేళ్ల వయసు నుంచి రోజూ సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి క్రికెట్ ఆడేవాడు. నగర శివార్లలోని విరార్ నుంచి ముంబైలోని పలు మైదానాలకు వచ్చి ఆడాడు. అయితే ఇది ఇబ్బందిగా ఉందని భావించిన తండ్రి పంకజ్ షా తమ నివాసాన్ని శాంటాక్రజ్ ప్రాంతానికి మార్చారు. ఇప్పటికే ముంబై మీడియా తనకి ‘పృథ్వీ మిస్సైల్’ అనే నిక్‌నేమ్ పెట్టింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
 
 ‘నా వ్యక్తిగత స్కోరు చెప్పొద్దని సహచరులను కోరా. కాబట్టి 490ల్లో ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు. 500 మార్కును చేరాక అందరూ అభినందిస్తుంటేనే నాకు తెలిసింది. చాలామందిలాగే నాకు కూడా సచిన్ అంటే ఇష్టం. కవర్‌డ్రైవ్ నాకు ఇష్టమైన షాట్. ప్రత్యేకంగా ఏదో సాధించాలని క్రీజులోకి వెళ్లలేదు. నా శైలిలో సింగిల్స్, డబుల్స్ తీస్తూ చెత్త బంతుల్ని బౌండరీలు కొట్టాను. శరీరం డీహైడ్రేట్ కాకుండా చాలా నీళ్లు తాగాను.
 
 
 నాలుగేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. మా నాన్నకు ఆట గురించి పెద్దగా తెలియదు. ఆయన స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు నన్ను అకాడమీలో చేర్పించారు. 500 పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు, నా జట్టుకు ఇది మంచి స్కోరు. ప్రతి బంతి మీద ఏకాగ్రత పెట్టి ఆడాలని కోచ్ చెప్పారు. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్ ప్రారంభిస్తాను. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఇన్నింగ్స్ మరిన్ని ఆడాలని అనుకుంటున్నాను.’    
 - పృథ్వీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement