4 నిమిషాలు... 2 గోల్స్
► మలుపు తిప్పిన గ్రిజ్‌మన్
► ఐర్లాండ్‌పై ఫ్రాన్స్ గెలుపు
► క్వార్టర్స్‌లోకి ప్రవేశం
► జర్మనీ, పోర్చుగల్ కూడా
► యూరో కప్
లైన్: ఆరంభంలో కాస్త తడబడినా... కీలక సమయంలో తనదైన శైలిలో చెలరేగిన ఫ్రాన్స్... యూరో చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ఫైనల్లో ఫ్రాన్స్ 2-1తో ఐర్లాండ్‌పై గెలిచి క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఫ్రాన్స్ తరఫున గ్రిజ్‌మన్ (58వ, 61వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా, బ్రాడీ (2వ నిమిషంలో) ఐర్లాండ్‌కు ఏకైక గోల్ అందించాడు. బంతిని అందుకునే క్రమంలో ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా... షెన్‌లాంగ్ (ఐర్లాండ్)ను మొరటుగా అడ్డుకోవడంతో రెండో నిమిషంలోనే ఐర్లాండ్‌కు పెనాల్టీ లభించింది.
దీన్ని బ్రాడీ గోల్‌గా మల్చడంతో ఆతిథ్య జట్టు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇక అక్కడి నుంచి ఎన్ని దాడులు చేసినా... ఫ్రాన్స్ గోల్ మాత్రం చేయలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలో 13 నిమిషాల తర్వాత సాగ్నా ఇచ్చిన క్రాస్ పాస్‌ను గ్రిజ్‌మన్ అద్భుతమైన హెడర్‌గా మల్చడంతో స్కోరు సమమైంది. మూడు నిమిషాల తర్వాత ఒలివర్ గిరౌడ్ (ఫ్రాన్స్) ఇచ్చిన పాస్‌ను మళ్లీ గ్రిజ్‌మన్ తక్కువ ఎత్తులో బలమైన షాట్‌గా మలిచాడు. దీంతో ఫ్రాన్స్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది.
జర్మనీ హవా
లిల్లీ: కచ్చితమైన పాస్‌లు... చూడచక్కని సమన్వయం.. గురి తప్పని షాట్‌లతో ఆకట్టుకున్న జర్మనీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. దీంతో 3-0తో స్లొవేకియాను చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీ తరఫున బొటెంగ్ (8వ ని.), గోమెజ్ (43వ ని.), డ్రాక్సలర్ (63వ ని.) గోల్స్ చేశారు. మ్యాచ్ ఆద్యంతం బంతిపై పూర్తి ఆధిపత్యం చూపెడుతూ జర్మనీ చేసిన దాడులకు ఏ దశలోనూ స్లొవేకియా అడ్డుకట్ట వేయలేకపోయింది. ఫలితంగా అవకాశాలనూ సృష్టించుకోలేక గోల్స్ చేయడంలో ఘోరంగా విఫలమైంది.
క్వార్టర్స్‌లో పోర్చుగల్
నైస్: స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా (117వ నిమిషంలో) ఎక్స్‌ట్రా టైమ్‌లో గోల్ చేయడంతో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్‌ఫైనల్లో పోర్చుగల్ 1-0తో క్రొయేషియాపై నెగ్గింది. దీంతో క్వార్టర్స్ పోరులో పోలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇరుజట్ల రక్షణశ్రేణి పటిష్టంగా ఉండటంతో పరస్పరం దాడులు చేసుకున్నా నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాలేదు. ఫలితంగా మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఓవరాల్‌గా క్రొయేషియా 15 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా.. ఒక్కసారి కూడా లక్ష్యాన్ని చేరలేదు. ఇదే సమయంలో పోర్చుగల్ ఐదు పర్యాయాలు ప్రయత్నించి విఫలమైంది. 25వ నిమిషంలో రొనాల్డో కొట్టిన ఫ్రీ కిక్ బార్‌ను తాకి బయటకు వెళ్లడంతో క్రొయేషియా ఊపిరి పీల్చుకుంది. 87వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టిన క్వారెస్మా మంచి సమన్వయంతో కదిలాడు. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌లో రొనాల్డో ఇచ్చిన దగ్గరి పాస్‌ను అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచి పోర్చుగల్‌ను గెలిపించాడు.