Grijman
-
కల నెరవేరేనా...
పోర్చుగల్... తమ చరిత్రలో ఎప్పుడూ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవని జట్టు. స్టార్ ఆటగాడు రొనాల్డో సూపర్ ప్రదర్శనతో ఈసారి ఫైనల్‌కు వచ్చింది. ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేమనే కసితో బరిలోకి దిగుతోంది. ఫ్రాన్స్... ఈసారి యూరో గెలిస్తే మూడుసార్లు గెలిచిన జట్టుగా జర్మనీ, స్పెయిన్‌ల సరసన నిలుస్తుంది. సొంతగడ్డపై అభిమానులను నిరాశపరచకూడదనే పట్టుదలతో ఆడబోతోంది. మరి ఎవరి కల నెరవేరుతుంది..? యూరో ఫైనల్ నేడు ⇒ తొలి టైటిల్‌పై పోర్చుగల్ గురి ⇒ రికార్డు కోసం ఫ్రాన్స్ ఆరాటం ⇒ రొనాల్డో, గ్రిజ్మన్లపైనే దృష్టి రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్: యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అభిమానులను అలరించిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు నేడు (ఆదివారం) జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో కొత్త స్టార్‌గా అవతరించిన ఆంటోనీ గ్రిజ్మన్ (ఫ్రాన్స్)తో పాటు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)ల సత్తాకు ఈ మ్యాచ్ అసలైన పరీక్ష కానుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో తమ జట్టును మరోసారి చాంపియన్‌గా నిలపాలని గ్రిజ్మన్ భావిస్తున్నాడు. మరోవైపు పోర్చుగల్‌కు మేజర్ టైటిల్ లేని లోటును తీర్చాలనే కసితో రొనాల్డో ఉన్నాడు. 2004లో స్వదేశంలోనే జరిగిన యూరో కప్ ఫైనల్లో గ్రీస్ చేతిలో 0-1తో పోర్చుగల్ ఓడిపోయింది. అప్పుడు 19 ఏళ్ల రొనాల్డో జట్టు ఓటమికి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఇక ఫ్రాన్స్ జట్టు 1984, 2000లో యూరో కప్‌లో విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు సార్లు సెమీస్‌లో పోర్చుగల్‌ను ఓడించే తుది పోరుకు చేరింది. ఇది ఈ జట్టుకు మూడో ఫైనల్. చివరిసారి ఈ రెండు జట్లు 2006 ప్రపంచకప్ సెమీస్‌లో తలపడగా జిదానే ఏకైక గోల్‌తో ఫ్రాన్స్ గెలిచింది. 1975లో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెగ్గిన పోర్చుగల్ ఆ తర్వాత త లపడిన 10 సార్లు పరాజయమే ఎదుర్కొంది. పటిష్టంగా ఫ్రాన్స్: ప్రత్యర్థితో పోలిస్తే ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లతో పైచేయిలో ఉంది. గోల్డెన్ బూట్ రేసులో ఆరు గోల్స్‌తో అందరికన్నా ముందున్న గ్రిజ్మన్ మరోసారి కీలకం కానున్నాడు. అతడితో పాటు ఫార్వర్డ్ గిరౌడ్, మిడ్‌ఫీల్డర్లు పయెట్, పోగ్బా ప్రత్యర్థి ఆటగాళ్లను వణికిస్తున్నారు. పోరాటమే ధ్యేయంగా..: రొనాల్డో ఇప్పటిదాకా ఫ్రాన్స్ జట్టుపై విజయం రుచి చూడలేదు. సెమీస్‌లో వేల్స్‌పై అత్యద్భుత ఆటను చూపెట్టి ఫామ్‌లో ఉన్న అతడిపైనే జట్టు ఆశలున్నాయి. నాని తనకు సహకారం అందిస్తే ఫ్రాన్స్‌కు ఇబ్బందులు తప్పవు. -
4 నిమిషాలు... 2 గోల్స్
► మలుపు తిప్పిన గ్రిజ్మన్ ► ఐర్లాండ్‌పై ఫ్రాన్స్ గెలుపు ► క్వార్టర్స్‌లోకి ప్రవేశం ► జర్మనీ, పోర్చుగల్ కూడా ► యూరో కప్ లైన్: ఆరంభంలో కాస్త తడబడినా... కీలక సమయంలో తనదైన శైలిలో చెలరేగిన ఫ్రాన్స్... యూరో చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో ఫ్రాన్స్ 2-1తో ఐర్లాండ్‌పై గెలిచి క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఫ్రాన్స్ తరఫున గ్రిజ్మన్ (58వ, 61వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా, బ్రాడీ (2వ నిమిషంలో) ఐర్లాండ్‌కు ఏకైక గోల్ అందించాడు. బంతిని అందుకునే క్రమంలో ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా... షెన్లాంగ్ (ఐర్లాండ్)ను మొరటుగా అడ్డుకోవడంతో రెండో నిమిషంలోనే ఐర్లాండ్‌కు పెనాల్టీ లభించింది. దీన్ని బ్రాడీ గోల్‌గా మల్చడంతో ఆతిథ్య జట్టు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇక అక్కడి నుంచి ఎన్ని దాడులు చేసినా... ఫ్రాన్స్ గోల్ మాత్రం చేయలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలో 13 నిమిషాల తర్వాత సాగ్నా ఇచ్చిన క్రాస్ పాస్‌ను గ్రిజ్మన్ అద్భుతమైన హెడర్‌గా మల్చడంతో స్కోరు సమమైంది. మూడు నిమిషాల తర్వాత ఒలివర్ గిరౌడ్ (ఫ్రాన్స్) ఇచ్చిన పాస్‌ను మళ్లీ గ్రిజ్మన్ తక్కువ ఎత్తులో బలమైన షాట్‌గా మలిచాడు. దీంతో ఫ్రాన్స్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. జర్మనీ హవా లిల్లీ: కచ్చితమైన పాస్‌లు... చూడచక్కని సమన్వయం.. గురి తప్పని షాట్లతో ఆకట్టుకున్న జర్మనీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. దీంతో 3-0తో స్లొవేకియాను చిత్తు చేసి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీ తరఫున బొటెంగ్ (8వ ని.), గోమెజ్ (43వ ని.), డ్రాక్సలర్ (63వ ని.) గోల్స్ చేశారు. మ్యాచ్ ఆద్యంతం బంతిపై పూర్తి ఆధిపత్యం చూపెడుతూ జర్మనీ చేసిన దాడులకు ఏ దశలోనూ స్లొవేకియా అడ్డుకట్ట వేయలేకపోయింది. ఫలితంగా అవకాశాలనూ సృష్టించుకోలేక గోల్స్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. క్వార్టర్స్‌లో పోర్చుగల్ నైస్: స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా (117వ నిమిషంలో) ఎక్స్ట్రా టైమ్‌లో గోల్ చేయడంతో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో పోర్చుగల్ 1-0తో క్రొయేషియాపై నెగ్గింది. దీంతో క్వార్టర్స్ పోరులో పోలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇరుజట్ల రక్షణశ్రేణి పటిష్టంగా ఉండటంతో పరస్పరం దాడులు చేసుకున్నా నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాలేదు. ఫలితంగా మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసింది. ఓవరాల్‌గా క్రొయేషియా 15 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా.. ఒక్కసారి కూడా లక్ష్యాన్ని చేరలేదు. ఇదే సమయంలో పోర్చుగల్ ఐదు పర్యాయాలు ప్రయత్నించి విఫలమైంది. 25వ నిమిషంలో రొనాల్డో కొట్టిన ఫ్రీ కిక్ బార్‌ను తాకి బయటకు వెళ్లడంతో క్రొయేషియా ఊపిరి పీల్చుకుంది. 87వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టిన క్వారెస్మా మంచి సమన్వయంతో కదిలాడు. దీంతో ఎక్స్ట్రా టైమ్‌లో రొనాల్డో ఇచ్చిన దగ్గరి పాస్‌ను అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచి పోర్చుగల్‌ను గెలిపించాడు.