కల నెరవేరేనా...
పోర్చుగల్... తమ చరిత్రలో ఎప్పుడూ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవని జట్టు.
స్టార్ ఆటగాడు రొనాల్డో సూపర్ ప్రదర్శనతో ఈసారి ఫైనల్‌కు వచ్చింది.
ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేమనే కసితో బరిలోకి దిగుతోంది.
ఫ్రాన్స్... ఈసారి యూరో గెలిస్తే మూడుసార్లు గెలిచిన జట్టుగా జర్మనీ, స్పెయిన్‌ల సరసన నిలుస్తుంది.
సొంతగడ్డపై అభిమానులను నిరాశపరచకూడదనే పట్టుదలతో ఆడబోతోంది. మరి ఎవరి కల నెరవేరుతుంది..?
యూరో ఫైనల్ నేడు
⇒ తొలి టైటిల్‌పై పోర్చుగల్ గురి
⇒ రికార్డు కోసం ఫ్రాన్స్ ఆరాటం
⇒ రొనాల్డో, గ్రిజ్‌మన్‌లపైనే దృష్టి
రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
పారిస్: యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అభిమానులను అలరించిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు నేడు (ఆదివారం) జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో కొత్త స్టార్‌గా అవతరించిన ఆంటోనీ గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్)తో పాటు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)ల సత్తాకు ఈ మ్యాచ్ అసలైన పరీక్ష కానుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో తమ జట్టును మరోసారి చాంపియన్‌గా నిలపాలని గ్రిజ్‌మన్ భావిస్తున్నాడు. మరోవైపు పోర్చుగల్‌కు మేజర్ టైటిల్ లేని లోటును తీర్చాలనే కసితో రొనాల్డో ఉన్నాడు.
2004లో స్వదేశంలోనే జరిగిన యూరో కప్ ఫైనల్లో గ్రీస్ చేతిలో 0-1తో పోర్చుగల్ ఓడిపోయింది. అప్పుడు 19 ఏళ్ల రొనాల్డో జట్టు ఓటమికి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఇక ఫ్రాన్స్ జట్టు 1984, 2000లో యూరో కప్‌లో విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు సార్లు సెమీస్‌లో పోర్చుగల్‌ను ఓడించే తుది పోరుకు చేరింది. ఇది ఈ జట్టుకు మూడో ఫైనల్. చివరిసారి ఈ రెండు జట్లు 2006 ప్రపంచకప్ సెమీస్‌లో తలపడగా జిదానే ఏకైక గోల్‌తో ఫ్రాన్స్ గెలిచింది. 1975లో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెగ్గిన పోర్చుగల్ ఆ తర్వాత త లపడిన 10 సార్లు పరాజయమే ఎదుర్కొంది.
పటిష్టంగా ఫ్రాన్స్: ప్రత్యర్థితో పోలిస్తే ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లతో పైచేయిలో ఉంది. గోల్డెన్ బూట్ రేసులో ఆరు గోల్స్‌తో అందరికన్నా ముందున్న గ్రిజ్‌మన్ మరోసారి కీలకం కానున్నాడు. అతడితో పాటు ఫార్వర్డ్ గిరౌడ్, మిడ్‌ఫీల్డర్లు పయెట్, పోగ్బా ప్రత్యర్థి ఆటగాళ్లను వణికిస్తున్నారు.
పోరాటమే ధ్యేయంగా..: రొనాల్డో ఇప్పటిదాకా ఫ్రాన్స్ జట్టుపై విజయం రుచి చూడలేదు. సెమీస్‌లో వేల్స్‌పై అత్యద్భుత ఆటను చూపెట్టి ఫామ్‌లో ఉన్న అతడిపైనే జట్టు ఆశలున్నాయి. నాని తనకు సహకారం అందిస్తే ఫ్రాన్స్‌కు ఇబ్బందులు తప్పవు.