
37 ఏళ్ల అనుభవం పనికొస్తుంది!
►కోచ్‌గా కొత్తగా చేయాల్సిందేమీ లేదు
►ఆడే వాతావరణం కల్పిస్తే చాలు రవిశాస్త్రి వ్యాఖ్యలు
కొలంబో: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ఎంపిక విషయంలో ఇటీవలి కాలంలో ఎంతో చర్చ జరిగింది. విభేదాలు, వివాదాలు అన్నీ వార్తల్లో నిలిచాయి. ఇలాంటి స్థితిలో రవిశాస్త్రి ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు ప్రత్యేకంగా ఉన్న సమయంలో శాస్త్రి బాధ్యతలు ఏమిటనేది అస్పష్టం. దీనికి ఆయన తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ‘నేను సహాయక సిబ్బంది మొత్తానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాను. మన జట్టు సభ్యులు మనసులో ఎలాంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా మైదానంలోకి వెళ్లి స్వేచ్ఛగా, భయం లేకుండా, సానుకూల దృక్పథంతో తమ ఆటను ప్రదర్శించేలా సిద్ధం చేయడమే నా పని. అదో రకమైన కళ. అది నాకు తెలుసు కాబట్టే ఈ పదవిలో ఉన్నాను’ అని ఆయన జవాబిచ్చారు.
తాను గతంలో టీమ్ డైరెక్టర్‌గా ఎక్కడ పనిని ముగించానో, ప్రస్తుతం అక్కడి నుంచే దానిని కొనసాగిస్తున్నానని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ‘నేను అదనపు బాధ్యతలతో ఇక్కడికి రాలేదని నా అభిప్రాయం. జట్టు కూడా అదే కాబట్టి మరో ఆలోచన లేకుండా అలా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోతే సరి. అంతా అలవోకగా సాగిపోతుంది. కొత్తగా నేను చేయాల్సిందేమీ లేదు. ఆట ఆడమని చెప్పి నేను పక్కకు తప్పుకుంటే సరిపోతుంది’ అని శాస్త్రి అన్నారు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో తమపై అజమాయిషీ చలాయించారని, ఒక రకంగా నియంతలా వ్యవహరించారని కూడా ఆటగాళ్లు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి అంశాలను చక్కబెట్టడంలో శాస్త్రి శైలి ఏమిటనే దానికి కూడా ఆయన పంచ్ డైలాగ్ చెప్పారు. ‘నేను 37 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతున్నాను. ఆటగాడిగా, కామెంటేటర్‌గా అనుభవం ఉంది. కాబట్టి ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో నాకు బాగా తెలుసు. ఇన్నేళ్ల పాటు నిరంతరాయంగా క్రికెట్‌తో అనుబంధం ఉంది. అందువల్ల ఈతరం క్రికెటర్లను కూడా అర్థం చేసుకోగలను. అసలు ఈ దశలో వారికి కోచింగే అవసరం లేదు. చక్కటి వాతావరణం కల్పించి వారు ఆడేలా ప్రోత్సహిస్తే చాలు’ అని రవిశాస్త్రి స్పష్టం చేశారు.
వారు కూడా సాధించలేనిది...
భారత క్రికెట్‌లో గొప్ప పేరున్న అనేక మంది క్రికెటర్లకు కూడా సాధ్యం కాని ఘనతను ప్రస్తుత జట్టు సాధించిందని రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘ఉదాహరణకు శ్రీలంక గడ్డపై 20 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలవడం అలాంటిదే. ఎంతో మంది క్రికెటర్లు 20 ఏళ్ల పాటు భారత్‌కు ఆడారు. అనేక సార్లు లంకలో పర్యటించారు కానీ సిరీస్ గెలవలేకపోయారు. గత జట్లకు సాధ్యం కాని విధంగా ఈ కుర్రాళ్లు వన్డే సిరీస్ కూడా గెలిచారు’ అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో సిరీస్‌ల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, దానిని కూడా సవాల్‌గా భావించి గెలవగల సామర్థ్యం ఈ జట్టుకు ఉందని శాస్త్రి చెప్పారు. నాయకుడిగా ఇప్పటికే అనేక విజయాలు సాధించిన కోహ్లి, భారత అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.