
70 ఏళ్ల వయసులో 'వెల్ రన్'
యుక్త వయసులో ఉన్న వాళ్లే పట్టుమని పదిమైళ్లు పరుగెత్తాలంటే ఆపసోపాలు పడతారు. మరి అటువంటింది 70 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా వరుసగా ఏడు రోజుల పాటు ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు సుదీర్ఘ మారథాన్ కార్యక్రమాల్లో పాల్గొని శభాష్ అనిపించింది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా 25 మైళ్లకు పైగా దూరం పరుగెడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మిస్సోరికి చెందిన చావ్ స్మిత్ వయసు ఏడు పదులు పైనే. కాకపోతే ఆమెకు మారథాన్ పై మక్కువ ఎక్కువ. ఐదు వారల్లో నాలుగు మారథాన్లు, ఒక ఏడాదిలో 10 మారథాన్లు, జీవితం మొత్తంలో కలుపుకుని 70 మారథాన్లు చేసిన ఘనత ఆమె సొంతం.
అయితే ఇవేవీ ఆమెకు పెద్దగా కనబడలేదు. దాంతో లేటు వయసులో ఒకేసారి వరుసగా ఏడు మారథాన్లు పాల్గొనాలని నిశ్చయించుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా కఠోర సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ ఘనతను సాధించేందుకు దాదాపు ఎనిమిది నెలలు విపరీతంగా శ్రమించింది. చివరి నాలుగు నెలలు సుదీర్ఘమైన లక్ష్యాలను ఎంచుకుంది. ఈ శిక్షణలో ప్రతీ వారం 15 మైళ్ల దూరం మొదలుకొని 130 మైళ్ల వరకూ పైగా పరుగు తీసేది.
కఠోరమైన శిక్షణ ముగిసిన తరువాత ఈ ఏడాది జనవరి 25వ తేదీ నుంచి 31 తేదీ వరకూ ఏడు వేర్వేరు దేశాల్లోని ప్రధాన నగరాల్లో స్మిత్ తన రికార్డు మారథాన్ కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పెర్త్, సింగపూర్, కైరో, అమెస్టర్డామ్, న్యూయార్క్, చీలి, కింగ్ జార్జ్, అంటార్కిటికా ప్రాంతాల్లో మారథాన్ పూర్తి చేసి అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. వరుసగా ఏడు రోజుల్లో తన అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తన యొక్క శ్రమతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. వీటిని పూర్తి చేసే క్రమంలో ప్రొద్దున్నే లేవడంతో పాటు దాదాపు 26 మైళ్లు దూరం పరుగెత్తినట్లు ఆమె తెలిపింది. ఒక నగరంలో మారథాన్ కార్యక్రమం ముగిసిన వెంటనే విమాన ప్రయాణంతో వేరే ప్రాంతానికి చేరుకున్నట్లు ఆమె పేర్కొంది. ఈ సుదీర్ఘ లక్ష్యాలను చేరడంలో తాను ఎటువంటి అలసటకు లోనుకాలేదని తెలిపింది.