కిట్ బ్యాగ్ లేదని మ్యాచ్ ను వద్దనుకున్నాడు!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో గుజరాత్ లయన్స్ హిట్టర్ అరోన్ ఫించ్ ఓ వింత కారణంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. వాంఖేడ్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ తుది జట్టులో ఫించ్ పాల్గొనకపోవడానికి కారణం అతని కిట్ బ్యాగ్. ఈ విషయాన్నిగుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా వెల్లడించాడు. గత మ్యాచ్ ఆడిన రాజ్ కోట్ నుంచి అరోన్ ఫించ్ కిట్ బ్యాగ్ ముంబైకి చేరేలేదట. దాంతోనే ముంబైతో మ్యాచ్ నుంచి ఫించ్ తప్పుకున్నట్లు రైనా తెలిపాడు.
జట్టులోని సహచరుల కిట్ నుంచి బ్యాట్ తీసుకుని ఆడటానికి ఫించ్ నిరాకరించడంతో మొత్తం మ్యాచ్ కే దూరం కావాల్సి వచ్చింది. ఒకవేళ సహచరుల బ్యాట్ తో ఆడిన క్రమంలో స్పాన్సర్ల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఫించ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. బ్యాట్ పై కంపెనీ స్టిక్కర్లు వేసుకునేందుకు సదరు కంపెనీలు క్రికటర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తాయి. ఈ క్రమంలోనే లేనిపోని తలపోటు తెచ్చుకోవడం కంటే మ్యాచ్ కు దూరంగా ఉండటమే మంచిదనే కారణంతోనే ఫించ్ అలా చేసి ఉండవచ్చని సమాచారం.