
బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 203 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఏబీ డివిలియర్స్ చెలరేగడంతో ఆర్సీబీ మరోసారి రెండొందల మార్కును దాటింది. 43 బంతుల్లో 3 ఫోర్లు,7 సిక్సర్లతో ఏబీ అజేయంగా 82 పరుగులు సాధించి ఆర్సీబీ భారీ స్కోరులో ముఖ్య భూమిక పోషించాడు. అతనికి జతగా పార్థివ్ పటేల్(43; 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్(46 నాటౌట్; 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 35 పరుగుల స్కోరు వద్ద కోహ్లి(13) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో పార్థివ్-ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 70 పరుగులు చేసింది. అయితే పార్ధివ్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత ఆర్సీబీ తడబడింది. స్వల్ప వ్యవధిలో మొయిన్ అలీ(4), అక్షదీప్ నాథ్(3) వికెట్లను నష్టపోయింది. అప్పుడు ఏబీ-స్టోయినిస్‌ల జోడి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఏబీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఏబీ చెలరేగి పోయాడు. బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ కొనసాగించి స్కోరును పరుగులు పెట్టించాడు. స్టోయినిస్ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో వీరిద్దరూ 48 పరుగులు సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment