
మెల్‌బోర్న్: దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ ఇకపై అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా తరఫున ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఆడతానని ప్రకటించిన ఏబీ తాజాగా వన్డేలపై కూడా ఆసక్తి తెలిపాడు. బిగ్‌బాష్ టి20 లీగ్ సందర్భంగా టీవీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడుతూ వన్డేలకూ సిద్ధమేనని ‘మిస్టర్ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్ చెప్పాడు. 2018, మే నెలలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ గతేడాది ప్రపంచకప్‌కు ముందు తన నిర్ణయాన్ని సమీక్షించుకున్నాడు.
మెగా ఈవెంట్ ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. అయితే దక్షిణాఫ్రికా సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. ఇటీవల సఫారీ జట్టుకు తన సహచరుడు మార్క్ బౌచర్ కోచ్ కావడంతో పరిస్థితులు మారిపోయాయి. బౌచర్... ఏబీ తిరిగి రావాలని కోరడంతో పాటు ఇద్దరి మధ్య సంప్రదింపులు కూడా జరిగాయి. దీంతో పొట్టి ఫార్మాట్‌కు సై అన్న డివిలియర్స్ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ సఫారీ జెర్సీతో బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నాడు.