విరాట్ 'మారలేదు'
దుబాయ్: టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డే ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలోనే కొనసాగుతున్నాడు. తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి తన మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. మరొకవైపు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో విశేషంగా రాణించిన ఏబీ తన రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుని టాప్ కు చేరుకున్నాడు.
కివీస్ తో సిరీస్ లో 262 పరుగులు చేసిన ఏబీ.. 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండో స్థానానికి పడిపోయాడు. గత జనవరిలో ఏబీని వెనక్కునెట్టి నంబర్ వన్ ర్యాంకును తొలిసారి సొంతం చేసుకున్న వార్నర్.. ఎక్కువ కాలం ఆ స్థానంలో నిలవలేకపోయాడు. ప్రస్తుతం ఏబీ తరువాత స్థానాల్లో డేవిడ్ వార్నర్(871), కోహ్లి(852)లు కొనసాగుతున్నారు. ఇదిలా ఉంచితే భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని వన్డే ర్యాంకింగ్స్ లో కూడా ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. రోహిత్ 12స్థానంలో, ధోని 13వ స్థానంలో కొనసాగుతున్నారు.