
డివిలియర్స్ మళ్లీ దూరం
రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న రాయల్ చాలెంజర్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మరోసారి గాయపడ్డాడు. ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లకు గాయం కారణంగా జట్టుకు దూరమైన ఏబీ.. మంగళవారం గుజరాత్ లయన్స్ తో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఏబీ మరొకసారి గాయపడటంతో కీలక మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చిందని ఆర్సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన మూడు, నాలుగు, ఐదు గేమ్ల్లో పాల్గొన్న ఏబీకి గాయం మరొకసారి తిరగబెట్టినట్లు తెలిపింది. ఇప్పటివరవకూ ఆర్సీబీ ఐదు మ్యాచ్ లు ఆడగా ఒకదాంట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ క్రమంలో ఏబీ దూరం కావడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ 46 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో కింగ్స్ బౌలర్లపై డివి విరుచుకుపడ్డాడు.