
ఇంకా మ్యాచ్ ఉండగానే ఏబీ ఇంటికి
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో పేలవమైన ఆట తీరు కనబరిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు నుంచి ఏబీ డివిలియర్స్ ముందుగానే వైదొలుగుతున్నాడు. ఆర్సీబీకి ఇంకా మ్యాచ్ ఉన్నప్పటికీ ఏబీ స్వదేశానికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆర్సీబీ ఆడే మ్యాచ్ కు అంత ప్రాముఖ్యత లేకపోవడంతో ఏబీ తిరిగి స్వదేశానికి చేరనున్నాడు.
వరుస మ్యాచ్ లతో తీరిక లేకపోవడంతో ముందుగానే స్వదేశానికి చేరుకుని కుటుంబంతో తగినంత సమయం గడపాలనే ఆలోచనలో భాగంగానే తాను మందుగా ఇంటికి వెళ్లనున్నట్లు డివిలియర్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించాడు.. 'ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమయ్యే క్రమంలో ఐపీఎల్లో ఇంకా మ్యాచ్ ఉండగానే స్వదేశానికి వెళుతున్నా. ముందుగా స్వదేశానికి చేరుకుని కుటుంబంతో తగినంత సమయం గడపాలనుకుంటున్నా. ఈ సీజన్ లో నిరాశపరిచినందుకు క్షమించండి. ఈ తప్పులు గుణపాఠంగా ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది కలుద్దాం'అని డివి పేర్కొన్నాడు.
ఈ సీజన్ లో ఇప్పటివరకూ 13 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు పది మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించగా, ఒక మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఐదు పాయింట్లను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ చివరిస్థానంలో ఉంది.