
నా దూకుడు వెనుక ఆమె: డివిలియర్స్
బెంగళూరు: ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ పాత్ర ఉందంటారు. ఇది బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ విషయంలో కూడా జరిగింది. సోమవారం ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య జరిగిన మ్యాచ్ లో డివి 9 సిక్సర్లు, 3 ఫోర్లతో చెలరేగిన విషయం తెలిసిందే. ఏబీ 46 బంతుల్లో 89 పరుగులతో దూకుడు ప్రదర్శించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు 148 పరుగులు చేసింది.
ఈ దూకుడు ఎలా సాధ్యమైందని మ్యాచ్ సమయంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ డివిలియర్స్ ను ప్రశ్నించాడు. నా దూకుడుకు నా భార్య డానియల్ ఇచ్చిన స్పూర్తే కారణమని డివిలియర్స్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు డానియల్ కు ఫోన్ చేశానన్నాడు. " గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాను. నా ఆటపై నాకు కొద్దిగా అనుమానం నెలకొంది' అని డానియల్ తో ప్రస్తావించినపుడు ఆమె నాకు దైర్యాన్నించిందని డివిలియర్స్ పేర్కొన్నాడు. వాట్సన్ ఔట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ మొదట్లో నెమ్మదిగా ఆడిన డెత్ ఓవర్లలో వరుస సిక్సర్లతో విజృంభించాడు. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరుపై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు ఓడినా డివిలియర్స్ దూకుడుతో అభిమానులు పండుగ చేసుకున్నారు.