
ఏబీ డివిలియర్స్
బెంగళూరు : సొంతగడ్డపై సమిష్టి ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చెలరేగింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో ఉమేశ్, సుందర్‌లు రాణించగా.. బ్యాటింగ్‌లో డివిలియర్స్ 57 ( 40 బంతులు,2 ఫోర్లు, 4 సిక్సులు), డికాక్45( 34 బంతులు,7 ఫోర్లు, ఒక సిక్సు) బ్యాట్‌ను ఝులిపించారు. దీంతో కింగ్స్‌పంజాబ్ జట్టుపై బెంగళూరు విజయం సాధించింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కింగ్స్‌పంజాబ్ 19.2 ఓవర్లకు 155 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 47(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు)తన జోరును కొనసాగించగా.. కరుణ్ నాయర్ 29 (26 బంతుల్లో 3 ఫోర్లు) చివర్లో కెప్టెన్ అశ్విన్ 33(20 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ గౌరవ ప్రదమమైన స్కోరు చేయగలిగింది.
డివిలియర్స్ మెరుపులు..
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్‌లో మెకల్లమ్ గోల్డెన్ డకౌట్‌తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, మరో ఓపెనర్ డికాక్‌తో కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ తరుణంలో కోహ్లి21(16 బంతులు, 4 ఫోర్లు)ని యువబౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అద్బుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ఔరా అనిపించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్, అప్పటికే జోరు మీదున్న డికాక్‌తో ఆచితూచి ఆడాడు. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన అశ్విన్ వరుస బంతుల్లో డికాక్, సర్ఫరాజ్‌ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మన్‌దీప్ సింగ్‌తో కలసి డివిలియర్స్ వరుస సిక్సర్లతో చెలరేగాడు. ఈ దశలో డివిలియర్స్ 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పంజాబ్ విధించిన లక్ష్యం చిన్నబోయింది. చివర్లో ఆండ్రూ టై బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన డివిలియర్స్ బౌండరీ లైన్ వద్ద కరుణ్‌నాయర్‌కు చిక్కాడు. ఆ వెంటనే మన్‌దీప్ కూడా రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ చేధించాల్సిన పరుగులు తక్కువగా ఉండటం చివరి ఓవర్లో సుందర్ ఫోర్ కొట్టడంతో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీకి విజయం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment