కోట్లాలో కోహ్లి, డివిలియర్స్‌ల ఊచకోత | RCB Beat By Five wickets Against Delhi Daredevils | Sakshi
Sakshi News home page

కోట్లాలో కోహ్లి, డివిలియర్స్‌ల ఊచకోత

Published Sat, May 12 2018 11:45 PM | Last Updated on Sat, May 12 2018 11:49 PM

RCB Beat By Five wickets Against Delhi Daredevils - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌(ఆర్సీబీ) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా నిలుపుకోగా.. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (70; 40 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), ఏబీ డివిలియర్స్‌‌(72నాటౌట్‌; 37బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సర్లు) బౌలర్లపై ఊచకోత కోయడంతో ఢిల్లీ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది.

డేర్‌డెవిల్స్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే ఓపెనర్లు పార్థీవ్‌ పటేల్‌(6), మొయిన్‌ అలీ(1) పెవిలియన్‌ చేరటంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కోహ్లి- డివిలియర్స్‌ జోడి జట్టు గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకుంది. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన కోహ్లి 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. మూడో వికెట్‌కు 118 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత కోహ్లి అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ మన్‌దీప్‌ సింగ్‌(13), సర్ఫరాజ్‌ ఖాన్‌(11) నిరుత్సాహపరిచారు. అయినప్పటికి డివిలియర్స్‌ చివరిదాకా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు సాధించగా, హర్షల్‌ పటేల్‌, లామించే, మిశ్రా తలో వికెట్‌ సాధించారు. 

అంతకముందు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నమ్మకాన్ని నిలబెడుతూ యుజ్వేంద్ర చహల్‌ ఆరంభంలోనే ఢిలీ​ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు. పృథ్వీ షా(2), జాసన్‌ రాయ్‌(12) విఫలమవ్వడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. దీంతో ఢిల్లీ కెప్టెన్‌ శ్రెయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత  రిషభ్‌ పంత్‌(61; 34 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు)ను మొయిన్‌ అలీ ఔట్‌ చేయడంతో 109 పరుగుల వద్ద  ఢిల్లీ మూడో వికెట్‌ను కోల్పోయింది. వెనువెంటనే శ్రేయాస్‌ అయ్యర్‌ నిష్క్రమించటంతో ఢిల్లీ స్కోర్‌బోర్డ్‌ నెమ్మదించింది. చివర్లో ఢిలీ​ అరంగేట్ర  ఆటగాడు అభిషేక్‌ శర్మ(46నాటౌట్‌; 19 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌(21 నాటౌట్‌; 20 బంతుల్లో; 2 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement