నితీష్‌ రాణా అరుదైన ఫీట్‌.! | Nitish Rana Says Luckily Got 2 Wickets | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 2:48 PM | Last Updated on Mon, Apr 9 2018 2:48 PM

Nitish Rana Says Luckily Got 2 Wickets - Sakshi

నితీష్‌ రాణాను అభినందిస్తున్న జట్టు సభ్యులు

కోల్‌కతా : ఐపీఎల్‌-11 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు నితీష్‌ రాణా అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ అయిన నితీష్‌ రాణా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా బంతిని అందుకొని రాణించాడు. వరుస బంతుల్లో ఏకంగా  దూకుడు మీద ఉన్న బెంగళూరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలను పెవిలియన్‌కు చేర్చి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. ఇలా వరుస బంతుల్లో ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు దక్కించుకున్న మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఇలా 2012 సీజన్‌లో జాక్వస్‌ కల్లీస్‌ బౌలింగ్‌లో తొలిసారి అవుటవ్వగా.. తిసారా పెరీరా బౌలింగ్‌లో 2016లోనూ ఇలానే పెవిలియన్‌కు చేరారు. తాజాగా నితీష్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో వెనుదిరిగారు.

ఇక రాణా బంతి అందుకున్న సమయాన డివిలియర్స్‌, కోహ్లిలు దూకుడు మీద ఉన్నారు. ఈ సమయంలో రాణాకు బౌలింగ్‌ ఇవ్వడమేంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరనుకున్నట్టే వేసిన తొలి బంతిని డివిలియర్స్‌ సిక్సుబాదాడు. ఆ మరుసటి బంతికే క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం స్ట్రైకింగ్‌ తీసుకున్న కోహ్లి అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో భారీ స్కోరు దిశగా పయనించిన బెంగళూరు ఒక్కసారి కుదేలైంది. చివర్లో  మన్‌దీప్‌ సింగ్‌ రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది.

బౌలింగ్‌ చేయమని దినేశ్‌ బాయ్‌ చెప్పాడు..
ఇక ఈ కీలక వికెట్ల చేజిక్కించుకోవడంపై మ్యాచ్‌ అనంతరం రాణా సంతోషం వ్యక్తం చేశాడు. ‘బాల్‌ గ్రిప్‌ బాగుండటంతో సరైన ప్రదేశంలో బంతిని వేస్తే వికెట్లు పడగొట్టచ్చని భావించా. అదృష్టవశాత్తు రెండు కీలక వికెట్లు దక్కాయి. ఆ సమయంలో ఇవి చాలా కీలకమైన వికెట్లు. దేశవాళి క్రికెట్‌లో ఢిల్లీ తరుఫున బౌలింగ్‌ చేసే వాడిని. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశా. దీంతో దినేశ్‌ బాయ్‌ మ్యాచ్‌కు ముందు ఏమ్యాచ్‌లోనైనా ఒకటి, రెండు ఓవర్లు వేసేందుకు సిద్దంగా ఉండని చెప్పాడు. లక్కీగా తొలి మ్యాచ్‌లోనే ఆ అవకాశం రావడంతో నేనెంటో రుజువైందని’  ఆనందం వ్యక్తం చేశాడు. ఇక బ్యాటింగ్‌లోను నితీశ్‌ రాణా (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. దీనిపై స్పందిస్తూ.. ‘పరుగులు చేయడమే నా బాధ్యత. ఒత్తిడి గురించి నేను ఆలోచించలేదు. గత సీజన్‌లో రాణించడంతో నాపై అంచనాలు పెట్టుకోవడం బాగుంది. ఒత్తిడిలో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానని’ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement