Kolkatha knight riders
-
కేకేఆర్ వారిద్దరితో ఓపెనింగ్ చేయించాలి.. అప్పుడే
అహ్మదాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విఫలమవుతున్న నేపథ్యంలో కొత్త ఓపెనింగ్ జోడిని బరిలోకి దించితే బాగుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. సునీల్ నరైన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు కేకేఆర్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్, కేవలం 89 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 30 పరుగుల మార్కును దాటగలిగాడు. ఇక సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గిల్ మరోసారి విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న అతడు 9 పరుగులు మాత్రమే చేసి, షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... ‘‘గత కొన్నేళ్లుగా నితీశ్ రాణా కేకేఆర్ తరఫున మూడో స్థానంలో మైదానంలో దిగి, విజయవంతమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడిని అదే స్థానంలో ఆడిస్తే బాగుంటుంది. కాబట్టి అతడి ప్లేస్‌లో రాహుల్ త్రిపాఠి లేదా సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలి. నిజానికి గిల్ కూడా పరుగులు చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. కాబట్టి, నరైన్- రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ చేస్తే బెటర్’’ అని చెప్పుకొచ్చాడు. కాగా నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ పంజాబ్‌పై 5 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: శివం మావి వ్యాఖ్యలు.. డేల్ స్టెయిన్ భావోద్వేగం! -
శివం మావి వ్యాఖ్యలు: కంటతడి పెట్టిన డేల్ స్టెయిన్!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. బౌలర్లలో తానే ఆదర్శం అంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ శివం మావి చెప్పిన మాటలు విని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో నిర్వహిస్తున్న టీ20 టైమ్‌ఔట్ అనే కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో పాటు డేల్ స్టెయిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా, శివం మావి మాట్లాడుతూ.. ‘‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి డేల్ స్టెయిన్ ఆటను ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నా. బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయనను అనుసరిస్తున్నా. డేల్ స్టెయిన్ లాగే అవుట్ స్వింగర్లు వేయడం ప్రాక్టీసు చేసేవాడిని. అతడితో పాటు బుమ్రా, భువనేశ్వర్ బౌలింగ్‌ను కూడా ఫాలో అయ్యేవాడిని. అయితే, నా రోల్‌మోడల్ మాత్రం డేల్ స్టెయిన్’’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఉద్వేగానికి లోనైన డేల్ స్టెయిన్.. శివం మాటలు విని తన కళ్లు చెమర్చాయని, తన ప్రభావం శివంపై ఇంతలా ఉంటుందని ఊహించలేదని పేర్కొన్నాడు. ‘‘నిజంగా అద్భుతం. నిజం చెప్పాలంటే.. తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. అందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మావి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడన్న స్టెయిన్, ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియాకు ఆడతాడని, తన కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2021లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల శివం మావి, సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: KKR vs PBKS: నైట్‌రైడర్స్ ఎట్టకేలకు.. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
అబుదాబి: షైక్ జాయేద్ స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2020 లో ఇప్పటివరకైతే కోల్‌కతాపై ఢిల్లీకి మంచి రికార్డే ఉంది. అక్టోబర్ 3న షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఢిల్లీ జట్టు 18 పరుగులతో విజయం సాధించింది. ఇక తాజా సీజన్లో 10 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించిన కోల్‌కతాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. హైదరాబాద్, పంజాబ్ జట్ల నుంచి పోటీనీ తట్టుకుని ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇయాన్ మోర్గాన్ సేన దూకుడు పెంచాలి. జట్లు ఢిల్లీ: అజింక్య రహానే, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), మార్కస్ స్టొయినిస్, షిమ్రాన్ హెయిట్‌మేర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాసిగో రబడా, అన్రిచ్ నోర్ట్జే ,తుషార్ దేష్పాండే కోల్‌కత: శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్, ప్రసిధ్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, కమలేష్ నాగర్కోటి. -
ఐపీఎల్ అభిమానులకు డబుల్ మజా
ఐపీఎల్ మొదలై రెండు వారాలైంది. ఈలోపే రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు అయ్యాయి. సిక్సర్లు మైదానాన్ని దాటుతున్నాయి. ఫోర్లయితే పదేపదే బౌండరీలైన్‌ను తాకుతున్నాయి. పరుగుల వరదే వరద. ఇన్నీ జరుగుతున్నా ఏదో వెలితి! అదే... వారాంతపు వినోదం డబుల్ మ్యాచ్‌ల హంగామా. ఇప్పుడా వెలతి తీరబోతోంది. ఇకపై శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌ల మజా క్రికెట్ ప్రియులను అలరించనుంది. నైట్ రైడర్స్ వర్సెస్ క్యాపిటల్స్ ఇప్పటిదాకా విజయాల పరంగా, ఆటగాళ్ల పరంగా సమఉజ్జీలుగా నిలిచిన రెండు జట్ల మధ్య జరిగే పోరులో బ్యాటా, బంతా ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. రెండింట నెగ్గి ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి. కానీ ఈ సీజన్లో ఈ రెండు ప్రత్యర్థులు తలపడటం ఇదే మొదటిసారి. ఇక పోటీ విషయానికొస్తే యువకులు, విదేశీ ఆల్‌రౌండర్ల సమతూకంగా ఉన్న రెండు జట్ల మధ్య శనివారం రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరగడం ఖాయం. కెప్టెన్ దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, రసెల్, మోర్గాన్లతో కూడిన కోల్‌కతా, రిషభ్ పంత్, స్టొయినిస్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. (‘ప్రియ’మైన విజయం) కోల్‌కతా మెరుగ్గా ఉంది. యువ పేసర్లు శివమ్ మావి, నాగర్కోటి గత మ్యాచ్‌ను తమ బౌలింగ్ సత్తాతో శాసించారు. అయితే ఓపెనింగ్‌లో నరైన్‌తో సమస్య ఏర్పడటంతో రిజర్వ్ ఓపెనర్ టామ్ బాంటన్‌ను దించుతుందా లేక విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తుందో చూడాలి. క్యాపిటల్స్ విషయానికొస్తే గాయంతో దూరమైన ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడని కోచ్ రియాన్ హారిస్ వెల్లడించారు. గత మ్యాచ్‌లో తమ జట్టు ఆశించిన మేర ఆడలేకపోయిందని... ఈ సారి తప్పకుండా రాణిస్తామని చెప్పారు. బెంగళూరు వర్సెస్ రాజస్తాన్ ఒంట్లో ఉన్న నీటినంతా పీల్చే మ్యాచ్ ఇది. నిప్పులు చిమ్మే వేడిలో సీజన్లో తొలిసారి మధ్యాహ్నం జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతున్నా... అక్కడ (యూఏఈలో) మాత్రం ఈ ఆట 2 గంటల నుంచే జరగడం ఆటగాళ్లకు కాస్త ఇబ్బందికరం. ఇది ప్రదర్శనపై ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశముంది. గత మ్యాచ్‌లో భారీస్కోర్లతో పాటు సూపర్ ఓవర్ విజయంతో ఉన్న బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉండగా... బ్యాటింగ్ వైఫల్యంతో చతికిలబడిన రాజస్తాన్‌ను గత ఓటమి కలవరపరుస్తోంది. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు పరుగులు చేసిన రాజస్తాన్ ఆట గతపోరులో తిరగబడింది. ముఖ్యంగా కెప్టెన్ స్మిత్, సామ్సన్ల సింగిల్ డిజిట్ స్కోర్లు బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపించింది. వీళ్లిద్దరితో పాటు తేవటియా, ఆల్‌రౌండర్ ఆర్చర్ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బెంగళూరు బెంగంతా సారథి కోహ్లిపైనే పెట్టుకుంది. మూడు మ్యాచ్‌లాడిన ఈ స్టార్ 25 పరుగులైనా చేయలేకపోయాడు. లీగ్ చరిత్రలోనే 5000 క్లబ్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి ఫామ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. అతను ఫామ్‌లోకి రావాలని బలంగా కోరుకుంటుంది. -
రసెల్‌కు బౌలింగ్ చేయనే చేయను..
దుబాయ్ : కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్‌కు బౌలింగ్ చేయడం ఇష్టం లేదంటూ ఆల్‌రౌండర్ సిద్దేశ్ లాడ్ కుండబద్దలు కొట్టాడు. రసెల్‌కు బౌలింగ్ వేయడం కంటే బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతా అంటూ తెలిపాడు. వాస్తవానికి రసెల్ ఉన్న కేకేఆర్ జట్టులోనే సిద్ధేశ్ లాడ్ ఉండడం గమనార్హం. ఇద్దరు ఓకే జట్టులో ఉండడంతో 2020 ఐపీఎల్లో రసెల్‌కు బౌలింగ్ వేసే అవకాశం సిద్దేశ్‌కు రాదు. కానీ మ్యాచ్‌లకు ముందు కేకేఆర్ ప్రాక్టీస్ సమయంలో తమ రిజర్వ్ బౌలర్లతోనే నెట్స్‌లో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒకవేళ రసెల్‌కు బౌలింగే చేయాల్సి వస్తే తాను అతనికి బౌలింగ్ వేయడానికి ఇష్టపడను.. అంతేకాదు ఇతర పరిష్కార మార్గాలు కూడా వెతుక్కుంటానంటూ సిద్ధేశ్ తెలిపాడు. (చదవండి : ఆరు బంతులు.. ఆరు రకాలుగా) 'ఎందుకో నాకు రసెల్‌ను చూస్తే బౌలింగ్ వేయాలనిపించదు. అతను బంతులను బలంగా బాదుతూ తన విధ్వంసకర ఆటను కొనసాగిస్తాడు. నేను ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నప్పుడు రసెల్ ఆటను గమనించాను. ప్రత్యర్థిగా ఎన్నోసార్లు విధ్వంసాన్ని దగ్గరుండి చూశాను. ఇప్పటివరకు నేను రసెల్‌కు బౌలింగ్ చేయలేదు.. ఇప్పుడు ఒకే జట్టులో ఉన్నాం కాబట్టి నెట్స్‌లోనూ అతనికి బౌలింగ్ చేయాలనుకోవడం లేదు.' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : పంత్.. సిక్సర్ల మోత!) ఇక గతేడాది 2019 ఐపీఎల్లో కోల్‌కతా తరపున రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. పరాజయం అంచున నిలిచిన ప్రతీసారి తన విధ్వంసకర ఆటతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ సీజన్లో 204.81 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థసెంచరీలు ఉన్నాయి. ఐదు లేదా ఆరు స్థానాల్లో వచ్చే రసెల్‌ను ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించిందని ఆ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, మెంటార్ డేవిడ్ హస్సీలు తెలిపారు. బ్యాటింగ్ ఆర్డర్లో రసెల్‌ను ముందు పంపితే టీ20 డబుల్ సెంచరీ చేసే సత్తా రసెల్‌కు ఉందంటూ డేవిడ్ హస్సీ అభిప్రాయపడ్డాడు. గౌతం గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. గంభీర్ తర్వాత కోల్‌కతా కెప్టెన్‌గా ఎంపికయిన దినేష్ కార్తిక్ సారధ్యంలో 2018లో ఫ్లే ఆఫ్స్, 2019లో లీగ్ స్టేజీలోనే వెనుదిరిగింది. -
చివరి లీగ్ ఆడబోతున్న కొల్‌కత ముంబై
-
మిత్రులకు, అభిమానులకు గుడ్‌బై..
సాక్షి, చెన్నై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చెన్నై నుంచి ముంబై వెళ్తూ విమానంలో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. చెన్నైలో తన సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడగా కోల్‌కతా ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ అనంతరం షారుఖ్ ఖాన్ ముంబై బయలు దేరాడు. తిరుగు ప్రయాణంలో కేకేఆర్ జట్టుకు చెందిన టీ షర్ట్ ధరించి ఉన్న తన సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టాడు. ‘ముంబై వెళ్లడానికి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఈ సెల్ఫీ దిగడానికి ప్రత్యేక కారణాలేమి లేవు. దక్షిణాదిలోని నా సినీ మిత్రులకు, క్రీడా మైదానంలోని క్రికెట్ అభిమానులకు గుడ్‌బై’ అంటూ ఈ ఫోటోకు కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా ‘విజిల్ పోడు’ యాష్‌ట్యాగ్ జోడించడం ద్వారా తమిళుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో ఏడు లక్షలకు పైగా లైకులు రాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఫర్హా ఖాన్ ‘ఎంతో అందగాడు’ అంటూ ఫోటోపై స్పందించారు. దీనికి ముందు, మ్యాచ్ సందర్భంగా కెమెరాకు చిక్కిన ధోని, షారుఖ్‌ల ఫోటోను చెన్నై సూపర్ కింగ్స్ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న ధోని, స్టాండ్స్‌లో నిలబడి ఉన్న షారుఖ్ పరస్పరం నవ్వుతూ పలకరించుకోవడం కనిపిస్తుంది. -
ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు పదేళ్లు..
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పరుగుల సునామీని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పరుగుల ప్రవాహం సాగిందిలా.. కేకేఆర్ తరపున బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన మెకల్లమ్.. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేసి ఖాతా తెరిచాడు. అంతే ఇక ఏ బౌలర్ కూడా మెల్లకమ్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక పోయారు. కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మెకల్లమ్ రికార్డు నెలకొల్పాడు. మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 222 పరుగుల ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభవాన్ని మిగిల్చిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌లోనూ చతికిల పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 82 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెకల్లమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించడంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 106 మ్యాచులాడిన మెకల్లమ్ 2801 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ సీజన్ 11లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మెకల్లమ్ ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతవరకు తన మార్క్ ప్రదర్శనను కనబరచకపోవటం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. -
మెకల్లమ్ పరుగుల సునామీని ఎవరూ మర్చిపోలేరు
-
నితీష్ రాణా అరుదైన ఫీట్.!
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా అరుదైన ఫీట్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ అయిన నితీష్ రాణా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా బంతిని అందుకొని రాణించాడు. వరుస బంతుల్లో ఏకంగా దూకుడు మీద ఉన్న బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిలను పెవిలియన్‌కు చేర్చి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. ఇలా వరుస బంతుల్లో ఈ స్టార్ బ్యాట్స్మెన్ల వికెట్లు దక్కించుకున్న మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఇలా 2012 సీజన్లో జాక్వస్ కల్లీస్ బౌలింగ్‌లో తొలిసారి అవుటవ్వగా.. తిసారా పెరీరా బౌలింగ్‌లో 2016లోనూ ఇలానే పెవిలియన్‌కు చేరారు. తాజాగా నితీష్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో వెనుదిరిగారు. ఇక రాణా బంతి అందుకున్న సమయాన డివిలియర్స్, కోహ్లిలు దూకుడు మీద ఉన్నారు. ఈ సమయంలో రాణాకు బౌలింగ్ ఇవ్వడమేంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరనుకున్నట్టే వేసిన తొలి బంతిని డివిలియర్స్ సిక్సుబాదాడు. ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం స్ట్రైకింగ్ తీసుకున్న కోహ్లి అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భారీ స్కోరు దిశగా పయనించిన బెంగళూరు ఒక్కసారి కుదేలైంది. చివర్లో మన్దీప్ సింగ్ రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. బౌలింగ్ చేయమని దినేశ్ బాయ్ చెప్పాడు.. ఇక ఈ కీలక వికెట్ల చేజిక్కించుకోవడంపై మ్యాచ్ అనంతరం రాణా సంతోషం వ్యక్తం చేశాడు. ‘బాల్ గ్రిప్ బాగుండటంతో సరైన ప్రదేశంలో బంతిని వేస్తే వికెట్లు పడగొట్టచ్చని భావించా. అదృష్టవశాత్తు రెండు కీలక వికెట్లు దక్కాయి. ఆ సమయంలో ఇవి చాలా కీలకమైన వికెట్లు. దేశవాళి క్రికెట్లో ఢిల్లీ తరుఫున బౌలింగ్ చేసే వాడిని. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశా. దీంతో దినేశ్ బాయ్ మ్యాచ్‌కు ముందు ఏమ్యాచ్‌లోనైనా ఒకటి, రెండు ఓవర్లు వేసేందుకు సిద్దంగా ఉండని చెప్పాడు. లక్కీగా తొలి మ్యాచ్‌లోనే ఆ అవకాశం రావడంతో నేనెంటో రుజువైందని’ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక బ్యాటింగ్లోను నితీశ్ రాణా (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. దీనిపై స్పందిస్తూ.. ‘పరుగులు చేయడమే నా బాధ్యత. ఒత్తిడి గురించి నేను ఆలోచించలేదు. గత సీజన్లో రాణించడంతో నాపై అంచనాలు పెట్టుకోవడం బాగుంది. ఒత్తిడిలో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానని’ పేర్కొన్నాడు. -
ఐపీఎల్‌కు ముందే కోల్‌కతాకు షాక్
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్-11 సీజన్ ప్రారంభం కాకముందే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌లిన్ గాయపడ్డాడు. అతనికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న కోల్‌కతా ఫ్రాంచైజీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు సార్లు కోల్‌కతాను టోర్నీ విజేతగా నిలబెట్టిన గంభీర్‌ను కాదని వేలంలో రూ. 9.6 కోట్లకు ఈ స్టార్ బ్యాట్స్‌మన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విధ్వసంకర ఆటగాడు టీ20 ట్రైసిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో కివీస్ ఆటగాడు రాస్ టేలర్ ఆడిన షాట్ బంతిని అందుకునేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతడి కుడిచేతి భుజానికి గాయం అయింది. వెంటనే క్రిస్‌లిన్‌ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయగా ఎడమ చేతి భుజం ఎముకకు గాయమైనట్లు గుర్తించారు. వారి సూచన మేరకు బ్రేస్ ధరించి లిన్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. గత ఐపీఎల్లో బౌండరీ ఆపే ప్రయత్నంలో ఇదే తరహాలో గాయపడి తన ఎడమచేతి భుజానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. ఇప్పటికే క్రిస్‌లిన్ మొత్తం మూడుసార్లు తన ఎడమ భుజానికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో దుబాయ్‌లో ప్రారంభం కాబోతున్న పాకిస్థాన్ ప్రిమీయర్ లీగ్(పీఎస్ఎల్)కు పూర్తి స్థాయిలో దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో క్రిస్‌లిన్ ఐపీఎల్ వరకు కోలుకుంటాడో లేదో అని కోల్‌కతా శిభిరంలో ఆందోళనలు నెలకొన్నాయి. -
నాకు పోటీ ఎవరూ లేరు: యూసఫ్ పఠాన్
కోల్‌కతా: "నేను ప్రత్యేకం నాకు ఎవరూ పోటీ లేరని' కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ అభిప్రాయ పడ్డాడు. ఎప్పుడూ భయపడనని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాజ సిద్దమైన ఆటనే ఆడటానికే ఇష్ట పడుతానని వ్యాఖ్యానించాడు. బుధవారం భారత జట్టుకు ఎంపికవుతారనే ఆశ ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించాడు. "ఇది పెద్ద విషయం కాదు, నాకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఎవరికి నేను పోటి కాదు, నాకెవరు పోటీ లేరని యూసఫ్ తెలిపాడు. నేను ఫాంలోకి వచ్చాను, ఇలానే నా ఆటను కొనసాగిస్తే అవకాశం రావొచ్చు. ఇప్పుడు భారత జట్టులో లేక పోయిన రేపటి రోజయిన అవకాశం రాకుండా ఉండదని పేర్కొన్నాడు. నేను ఇతరులను పట్టించుకోనని, మంచి క్రికెట్ ఆడటమే నా కర్తవ్యమన్నాడు'. తనకు మంచి రోజులు మొదలయ్యాయని త్వరలోనే భారత జట్టుకు ఎంపికైతనని యూసఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహజ సిద్దమైన ఆటనే ప్రదర్శిస్తానని, ఢిల్లీ మ్యాచ్ లో అలానే ఆడానని యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యచ్ లో చాలా ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ కు వెళ్లానన్నాడు. తొలి బంతి అయినా, 40 వ బంతైనా నా షాట్ లో మార్పు ఉండదని యూసఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో యూసఫ్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు.