బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ (పాత చిత్రం)
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పరుగుల సునామీని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
పరుగుల ప్రవాహం సాగిందిలా..
కేకేఆర్ తరపున బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన మెకల్లమ్.. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేసి ఖాతా తెరిచాడు. అంతే ఇక ఏ బౌలర్ కూడా మెల్లకమ్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక పోయారు. కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మెకల్లమ్ రికార్డు నెలకొల్పాడు. మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 222 పరుగుల ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్..
క్రికెట్ అభిమానులకు కొత్త అనుభవాన్ని మిగిల్చిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌లోనూ చతికిల పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 82 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెకల్లమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించడంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 106 మ్యాచులాడిన మెకల్లమ్ 2801 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ సీజన్ 11లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మెకల్లమ్ ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతవరకు తన మార్క్ ప్రదర్శనను కనబరచకపోవటం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment