![IPL 2021 Dale Steyn Gets Emotional After Shivam Mavi Calls His Idol - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/27/shivam.jpg.webp?itok=41JIMctZ)
Photo Courtesy: YouTube
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. బౌలర్లలో తానే ఆదర్శం అంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ శివం మావి చెప్పిన మాటలు విని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో నిర్వహిస్తున్న టీ20 టైమ్‌ఔట్ అనే కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో పాటు డేల్ స్టెయిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా, శివం మావి మాట్లాడుతూ.. ‘‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి డేల్ స్టెయిన్ ఆటను ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నా. బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయనను అనుసరిస్తున్నా. డేల్ స్టెయిన్ లాగే అవుట్ స్వింగర్లు వేయడం ప్రాక్టీసు చేసేవాడిని. అతడితో పాటు బుమ్రా, భువనేశ్వర్ బౌలింగ్‌ను కూడా ఫాలో అయ్యేవాడిని. అయితే, నా రోల్‌మోడల్ మాత్రం డేల్ స్టెయిన్’’ అని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో ఉద్వేగానికి లోనైన డేల్ స్టెయిన్.. శివం మాటలు విని తన కళ్లు చెమర్చాయని, తన ప్రభావం శివంపై ఇంతలా ఉంటుందని ఊహించలేదని పేర్కొన్నాడు. ‘‘నిజంగా అద్భుతం. నిజం చెప్పాలంటే.. తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. అందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మావి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడన్న స్టెయిన్, ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియాకు ఆడతాడని, తన కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2021లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల శివం మావి, సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment