ఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లి ద్వయం
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పై దక్షిణాఫ్రికా క్రికెట్ స్టార్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిలియర్స్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తన సహచరుడు, ఆర్సీబీ జట్టు కెప్టెన్ విరాట్‌కు ‘ఇప్పటికైతే అతడే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు’ అంటూ కితాబిచ్చాడు. 2011 నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్న ఏబీ, విరాట్‌లు తమ అద్భుత ప్రదర్శనలతో ఐపీఎల్ చరిత్రలో ఎన్నో మధురమైన ఇన్నింగ్స్‌లు ఆడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. టీ-20 చరిత్రలో రెండు సార్లు 200 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు.
ఐపీఎల్, అంతర్జాతీయం...
‘విరాట్ పోరాట పటిమ అమోఘం. అతను ఎప్పటికీ అత్యుత్తమ ఆటగాడే. నిరంతరం జట్టు విజయం కోసం తపించే కోహ్లి అన్నింటికీ అర్హుడు’ అంటూ డివిలియర్స్ విరాట్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘ఐపీఎల్‌లో 4619 పరుగులతో టాప్‌లో నిలిచిన కోహ్లి, వన్డేల్లో 35, టెస్టుల్లో 21 సెంచరీలు సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దశాబ్దకాలంలోనే విరాట్ ఇన్ని రికార్డులు నెలకొల్పడంలో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిందేం లేదు. అతను వాటన్నింటికీ అర్హుడు’ అని డివియర్స్ తన సహచర ఆటగాడిని ఆకాశానికెత్తేశాడు. అతనో పరుగుల సునామీ, మైదానంలో పాదరసంలా కదిలే చురుకైన ఆటగాడు అని అన్నాడు. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో పరుగుల వరద పారించడం నిజంగా గొప్ప విషయం. అతనితోపాటు ఆడడం నిజంగా నాకెంతో ఆనందాన్నిస్తుందని డివిలియర్స్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment