ఒక్క గేమ్ కూడా మిస్సవను
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్
న్యూఢిల్లీ: తాను జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో ఏ ఒక్క మ్యాచ్‌ను కూడా వదులుకోవడానికి ఇష్టపడనని దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే పలు మ్యాచ్‌లను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన డివిలియర్స్ దానిపై తాజాగా స్పందించాడు. ‘‘నా తొలి ప్రాధాన్యత జాతీయ జట్టుకే. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లు మిస్సయి ఉండవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా తరపున ఒక్క గేమ్ కూడా మిస్ కావడానికి నేను అంగీకరించను.
జాతీయ జట్టుకు ఆడటాన్ని ఎప్పుడూ వదులుకోను. నా ఫామ్‌పై ఎటువంటి ఆందోళన లేదు. మీరు ఆశించినా, ఆశించకపోయినా నా ఫామ్‌పై బెంగ లేదు. కొన్ని మంచి షాట్లతో ఇన్నింగ్స్ ఆరంభిస్తే, ఫామ్‌ను అందుకోవడం కష్టమేమీ కాదు. నేను సెంచరీ చేయకపోయినప్పటికీ, బంతిని హిట్ చేయడంలో నాది ఎప్పుడు ఒకటే పద్ధతి’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.