నాకో చాన్స్ ఇవ్వండి, వరల్డ్ కప్ గెలుస్తా: కెప్టెన్
లండన్: చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇలా ఆడితే మ్యాచ్‌లను ఫినిష్ చేయలేం. ఎంతో అసంతృప్తిగా ఉంది. మొదటి 15-20 ఓవర్లలోనే టీమిండియా పట్టు సాధించింది. ఈ మ్యాచ్ క్రెడిట్ వాళ్లదే. గొప్ప అకుంఠిత దీక్ష చూపించారు. ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆడారు’ అని డివిలియర్స్ చెప్పాడు.
సెమీస్ చేరాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయి.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకున్న నేపథ్యంలో డివిలియర్స్ మీడియాతో మాట్లాడాడు. ‘నేను మంచి కెప్టెన్. జట్టును ముందుండి నడిపించగలను. నా సారథ్యంలో వరల్డ్ కప్ విజయాన్ని అందించగలనని అనుకుంటున్నా. ఈ టోర్నమెంటులో ఏ జరిగిందనేది ఇక్కడితోనే ముగిసిపోయింది. ఇకముందు మెరుగ్గా రాణిస్తాం’ అని డివిలియర్స్ చెప్పాడు. భారత్‌తో మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నా.. జట్టు మాత్రం మ్యాచ్ ఆసాంతం నింపాదిగానే ఆడిందని చెపుక్చొచ్చాడు.