పరుషంగా మాట్లాడక తప్పదు!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం భారత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కొత్త తరహా వ్యూహాలతో మళ్లీ సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోహ్లి జట్టును మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అతను అంగీకరించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విజయం దాని ఫలితమేనని అతను చెప్పాడు. ‘మనం ఇలాంటి విషయాల్లో నిజాయితీగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో సహచర ఆటగాళ్లను బాధపెట్టేలా, మనసును నొప్పించే విధంగా కఠినంగా మాట్లాడాల్సి ఉంటుందనేది నా నమ్మకం.
లంక ముందు మేం తలవంచిన తర్వాత నాతో సహా ఎవరెవరు ఏం తప్పులు చేశామో మాట్లాడుకున్నాం. ఈ స్థాయిలో ఆడేందుకు కోట్లాది మంది నుంచి మనల్నే ఎందుకు ఎంచుకున్నారో నిరూపించాల్సి ఉందని చెప్పాను’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. దేశానికి ఆడగల, ఓడినా మళ్లీ కోలుకొని చెలరేగగల సత్తా తమకు ఉందని చూపించాల్సిందిగా ఆటగాళ్లను కోరానని... ఒకరిద్దరు కాకుండా సమష్టి ప్రదర్శనతోనే దక్షిణాఫ్రికాతో గెలుపు సాధ్యమైందని అతను చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో కూడా మాజీ కెప్టెన్ ధోని సలహాలు తీసుకోవడాన్ని కోహ్లి సమర్థించుకున్నాడు. ‘గత మ్యాచ్‌లో కేదార్ జాదవ్‌కు బౌలింగ్ ఇచ్చే విషయంలో ధోనితో చర్చించాను. ఇక్కడా ఫీల్డింగ్ ఏర్పాట్ల విషయంలో మాట్లాడాను. కీలక సమయాల్లో నేను ఒంటరిగా ఉన్నాననే భావన రాకూడదు. తుది నిర్ణయం నాదే అయినా అనుభవజ్ఞుడైన ధోని నుంచి సూచనలు తీసుకున్నా’ అని విరాట్ విశ్లేషించాడు.
స్వింగ్ లేదు...
ఇంగ్లండ్ గడ్డపై బంతి స్వింగ్ కావడం సాధారణం. కానీ ఈ సారి చాంపియన్స్ ట్రోఫీలో స్వింగ్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని భారత పేసర్లు బుమ్రా, భువనేశ్వర్ కూడా అంగీకరించారు. ‘అందుకు కారణం ఏమిటో సరిగ్గా చెప్పలేం. గతంలో పిచ్‌లు ఈ సీజన్‌లో ఎప్పుడూ ఇలా లేవు. స్వింగ్ మాత్రం చాలా కష్టమైపోయింది. దాంతో లెంగ్త్‌లో మార్పులు చేసి బౌలింగ్ చేయాల్సి వస్తోంది. దక్షిణాఫ్రికాతో అదే వ్యూహంతో ఫలితం సాధించాం’ అని భువనేశ్వర్ చెప్పాడు. మరోవైపు డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని బుమ్రా అన్నాడు. ‘బౌలర్‌కు ఏదైనా ఒక ముద్ర పడిపోవడం మంచిది కాదు. ఎప్పుడు బంతి ఇస్తే అప్పటి పరిస్థితులను బట్టి బాగా బౌలింగ్ చేయగలిగి ఉండాలి. నేను డెత్ బౌలర్‌ని మాత్రమే కాదు. ఇంగ్లండ్‌లో నేను మొదటిసారి ఆడుతున్నాను కాబట్టి కోహ్లి, కుంబ్లే, ధోనిల సూచనల ప్రకారం బౌలింగ్ చేస్తున్నాను’ అని బుమ్రా వెల్లడించాడు.
షారుఖ్ ఖాన్‌ను అనుకరించట్లేదు!
‘సెంచరీ పోజు’పై శిఖర్ ధావన్
లండన్: వన్డే గానీ టెస్టు గానీ సెంచరీ చేయగానే శిఖర్ ధావన్ ఇచ్చే పోజు క్రికెట్ అభిమానులందరికీ చిరపరిచితమే. రెండు చేతులూ వెడల్పుగా చాస్తూ కాస్త తలెత్తి చూసే ఆ స్టయిల్ ధావన్‌కే ప్రత్యేకం. ఇది కొంత వరకు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను గుర్తుకు తెస్తుంది. ఇదే విషయంపై ఒక ఇంటర్వూ్యలో సరదాగా అడిగిన ప్రశ్నకు ధావన్ జవాబిచ్చాడు. ‘నాకు బాలీవుడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. షారుఖ్‌ను అనుకరించట్లేదు కూడా. అది సహజంగా వచ్చింది. నేను తొలిసారి సెంచరీ చేసినప్పుడు అప్రయత్నంగా ఆ పోజులో నిలబడ్డాను. తర్వాత అదే నా మార్క్‌గా మారిపోయింది. దాని కోసం ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు’ అని ధావన్ నవ్వుతూ చెప్పాడు. ఆధ్యాత్మిక భావనలు ఉన్న తాను, ఫామ్‌లో లేని సమయంలో సూఫీ సంగీతంతో సాంత్వన పొందుతానని శిఖర్ వెల్లడించాడు. ‘21 ఏళ్ల వయసు నుంచే సూఫీ సంగీతం వింటున్నాను. మంచి సాహిత్యం ఉన్న పాటలనే నేను ఇష్టపడతాను. గజల్స్ అంటే ప్రాణం. ఇవన్నీ కూడా నాకు ప్రశాంతతనిస్తాయి’ అని ఈ పంజాబీ వ్యాఖ్యానించాడు.