
పోర్ట్ ఎలిజబెత్: మిస్టర్ 360 డిగ్రీస్, క్రికెట్ సూపర్‌మ్యాన్, విధ్వంసక బ్యాట్స్‌మన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ 34 ఏళ్ల అబ్రహం బెంజిమన్ డివిలియర్స్ (ఏబీడీ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అలసిపోయినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 2004 డిసెంబరు 17న ఇంగ్లండ్‌పై తాను టెస్టు అరంగేట్రం చేసిన పోర్ట్ ఎలిజబెత్ మైదానం నేపథ్యంలో చిత్రీకరించిన ‘రిటైర్మెంట్ వీడియో’ సందేశాన్ని అతడు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఒకటిన్నర నిమిషాల ఈ వీడియోలో ఏమన్నాడో అతడి మాటల్లోనే...
వైదొలగాల్సిన సమయం వచ్చింది...
కఠినమైనదే అయినా చాలా తీవ్రంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. బాగా ఆడుతున్నప్పుడే వైదొలగాలనుకున్నా. భారత్, ఆస్ట్రేలియాలపై సిరీస్ విజయాలతో ఆ సమయం వచ్చిందని భావిస్తున్నా. నిజాయతీగా చెప్పాలంటే అలసిపోయా. నా పాత్ర ముగిసింది. ఇది మిగతావారు బాధ్యత తీసుకోవాల్సిన సమయం. శక్తి లేకున్నా పరుగెత్తుతున్నట్లుంది. అందుకే తప్పుకోవాలనుకున్నా. విదేశాల్లో (లీగ్‌లు) ఆడటంపై ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. దేశవాళీలో టైటాన్స్ జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా తరఫున ఏ ఒక్క ఫార్మాట్‌కో పరిమితం కావడం నాకు సరైందిగా అనిపించట్లేదు. నా ఉద్దేశంలో జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో సేవలందించాలి. లేదంటే మొత్తంగా తప్పుకోవాలి. ఇన్నేళ్లుగా సహకరించిన కోచ్‌లు, సహాయక సిబ్బందికి రుణపడి ఉంటాను. కెరీర్‌లో నాతో పాటు ఆడిన సహచరుల వల్లే ఎదగగలిగా. వారితో పాటు దక్షిణాఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. కెప్టెన్ డు ప్లెసిస్, ప్రొటీస్ జట్టుకు నా బలమైన మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment