వన్డే కెప్టెన్సీకి గుడ్ బై!
కేప్టౌన్:గతేడాది దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్.. ఇప్పుడు వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పాటు, ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఏబీ కెప్టెన్సీలోని సఫారీ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో తన వన్డే కెప్టెన్సీ కి సంబంధించి ఏబీ డివిలియర్స్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇక వన్డే జట్టు పగ్గాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు.
తన కెరీర్ కు సంబంధించి ఆగస్టు నెలలో ఓ నిర్ణయం తీసుకుంటానని ముందుగానే తెలిపిన ఏబీ.. ఆ మేరకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. తన పదవికి రాజీనామా చేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్న ఏబీ.. టెస్టుల్లో, టీ 20 ల్లో కెప్టెన్ గా మెరుగైన ఫలితాలు సాధించిన డు ప్లెసిస్ కు వన్డే సారథ్య బాధ్యతల్ని అప్పగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ వేరే వ్యక్తికి కెప్టెన్సీ ఇచ్చినా అందుకు తనవంతు సహకారం ఉంటుందన్నాడు. ఆరేళ్లుగా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్ గా చేయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఏబీ తెలిపాడు.