కూలీ కొడుకు.. కరోడ్ పతి అయ్యాడు! | actory worker’s son who netted Rs 3.2 crore in IPL auction | Sakshi
Sakshi News home page

కూలీ కొడుకు.. కరోడ్ పతి అయ్యాడు!

Published Sun, Feb 7 2016 3:39 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

కూలీ కొడుకు.. కరోడ్ పతి అయ్యాడు!

కూలీ కొడుకు.. కరోడ్ పతి అయ్యాడు!

బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంటేనే క్రికెట్ పండుగ. తొమ్మిదేళ్ల క్రితం అవతరించిన ఐపీఎల్ అంచెలంచెలుగా ఎదిగి యావత్ ప్రపంచాన్నిఆకర్షిస్తోంది. అనామకులను, గల్లీలో క్రికెట్ ఆడిన వారిని క్షణాల్లో స్టార్లుగా మార్చేస్తుంది. వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అలాంటి ఘటనే శనివారం బెంగళూరులో జరిగిన ఐపీఎల్ వేలంలో చోటు చేసుకుంది. ఒక అనామక క్రికెటర్ ను కరోడ్ పతిని చేసింది. అతడే నాథూ సింగ్. జైపూర్ లోని ఓ వైర్ల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే భరత సింగ్ కుమారుడు. అతనికి దేశవాళీల్లో కూడా పెద్దగా అనుభవం లేదు. కేవలం 11 టీ 20 మ్యాచ్ లు మాత్రమే అతను దేశవాళీల్లో ఆడాడు. అయితేనేం ఐపీఎల్ వేలంలోఅతనికి కాసుల వర్షం కురిసింది. అది కూడా లక్షల్లో కాదు.. కోట్ల రూపాయల్లో. ఈ యువ పేసర్ ను ముంబై ఇండియన్స్ రూ.3.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తొలిసారి ఐపీఎల్లో ఆడబోతున్న నాథూకు ఒక్కసారిగా పెద్ద మొత్తం వెచ్చించడం అతన్ని సైతం ఆశ్చర్యపరిచింది.

తండ్రి కష్టార్జితంతో...

నాథూ తండ్రి భరత్ సింగ్ వైర్ల ఫ్యాక్టరీలో లేబర్. మూడేళ్ల క్రితం వరకు కూడా నాథూ మదిలో సీరియస్ క్రికెట్ ఆలోచనే రాలేదు. 17 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి కొద్ది రోజుల్లో ఏదో ఒక ఫ్యాక్టరీలో లేబర్‌గా చేరిపోదామని సిద్ధమైపోయాడు. టెన్నిస్ బాల్‌తో వేగంగా బౌలిం గ్ చేయడమే అతనికి తెలుసు. కానీ కొందరు మిత్రులకు అది కూడా చాలా వేగంగా అనిపించి ప్రోత్సహించారు. కోచింగ్ అకాడమీలో చేరేం దుకు తండ్రి వద్ద అప్పటివరకు ఉన్న మొత్తం పొదుపు రూ. 10 వేలు పెట్టేశారు. ఆ తరువాత తన ప్రతిభను చాటుకుంటూ జిల్లా స్థాయి టోర్నీల్లో సంచలన ప్రదర్శనతో  అదరగొట్టాడు. ఏడాది తిరిగే లోపు రాజస్థాన్ అండర్-19 జట్టులోకి వచ్చేశాడు.

 

వేగమే అతని బలం:

నాథూ సింగ్ మాత్రం పేదరికానికి చిరునామాలాగే పెరిగాడు. అయితే అది అతని ప్రతిభను అడ్డుకోలేదు. ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా బంతులు విసురుతున్న బౌలర్‌గా నాథూ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతను వేసే ఏ బంతీ కూడా 140 కిలోమీటర్ల వేగానికి తగ్గడం లేదు. లెదర్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన మూడేళ్ల లోపే రాజస్థాన్ సీనియర్ జట్టులోకి వచ్చిన నాథూ సింగ్... తన తొలి రంజీ ట్రోఫీ సీజన్‌లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో అతను విసిరే బంతి దాదాపు 160 కి.మీ వేగంతో దూసుకువెళుతూ ప్రత్యర్థి గుండెల్లో వణుకు పుట్టించడం మరో విశేషం.  మరి ఈ యువ క్రికెటర్ ఐపీఎల్లో నాథూ ఎక్స్ప్రెస్ అనిపించుకుంటాడో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement