![Mumbai Indians Add One More Franchise To Their Roster, Acquire 49 Percent Stake In London Based Franchise Oval Invincibles](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/jhj_6.jpg.webp?itok=tx-kzsKy)
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదు క్రికెట్ ఫ్రాంచైజీలు కలిగిన RIL.. తాజాగా ద హండ్రెడ్ లీగ్‌లోని ఓవల్ ఇన్విన్సిబుల్స్ (లండన్ బేస్డ్) ఫ్రాంచైజీలో 49 శాతం వాటాను సొంతం చేసుకుంది. మిగిలిన 51 శాతం వాటాను ఇన్విన్సిబుల్స్ మాతృ సంస్థ అయిన సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ (SCC) నిలబెట్టుకుంది.
RIL, దాని అనుబంధ సంస్థ అయిన RISE వరల్డ్‌వైడ్ ద్వారా సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్విన్సిబుల్స్‌లో తమ వాటా కోసం RIL దాదాపు 644 కోట్ల రూపాయలు (60 మిలియన్ GBP) చెల్లించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) విక్రయించిన మొట్టమొదటి ఫ్రాంచైజీ ఓవల్ ఇన్విన్సిబుల్స్. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ విలువ 1320 కోట్ల రూపాయలుగా (123 మిలియన్ GBP) ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ను ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తమ కుటుంబంలోకి స్వాగతించారు.
ఈ భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ అభిమానుల స్థావరాన్ని భారత్‌తో పాటు న్యూయార్క్, UAE, దక్షిణాఫ్రికా, ఇప్పుడు ఇంగ్లండ్‌కు విస్తరిస్తున్నామని ఆమె అన్నారు. మా ప్రపంచ క్రికెట్ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని నీతా అంబాని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొన్న మూడో ఐపీఎల్ జట్టు..
కాగా, ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలైన లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పెట్టుబడులు పెట్టాయి. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీను సన్‌రైజర్స్ యాజమాన్యం సన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వంద శాతాన్ని సన్ గ్రూప్ కొనుగోలు చేసింది.
అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం RPSG గ్రూప్.. మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఒరిజినల్స్ మొత్తం విలువలో 49 శాతాన్ని RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు.
హండ్రెడ్ లీగ్‌లో ఇన్విన్సిబుల్స్ హవా
ఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళల జట్టు 2021, 2022 ఎడిషన్లలో ద హండ్రెడ్ విజేతగా నిలిచింది. పురుషుల జట్టు 2023, 2024 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉంది. ఈ ఫ్రాంచైజీ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ రెండు సందర్భాలలో ఛాంపియన్స్ లీగ్‌ను కూడా గెలుచుకుంది. ఇటీవల, MI కేప్ టౌన్ SA20 2025 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఐ ఫ్రాంచైజీలు ఇవే..!
ముంబై ఇండియన్స్ (ఐపీఎల్), ముంబై ఇండియన్స్ (డబ్ల్యూపీఎల్), ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా టీ20 లీగ్), ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ద హండ్రెడ్ లీగ్)
Comments
Please login to add a commentAdd a comment