మెకల్లమ్ రికార్డును బ్రేక్ చేశాడు!
లండన్:ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్ ఆడమ్ లైత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన సంచలన బ్యాటింగ్ తో ట్వంటీ 20 ఫార్మాట్ లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాట్వెస్ట్ ట్వంటీ 20 బ్లాస్ట్ లో భాగంగా యార్కషైర్ తరపున బరిలోకి దిగిన లైత్.. 161 పరుగులు సాధించాడు. తద్వారా ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ నమోదు చేసిన 158 పరుగుల రికార్డును బద్ధలు కొట్టాడు. గతంలో మెకల్లమ్ రెండు సార్లు 158 పరుగుల మార్కును చేరుకున్నాడు. 2008 ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగి అజేయంగా 158 పరుగులు చేశాడు. ఆ తరువాత 2015లో వార్విక్ షైర్ తరపున ఆడే క్రమంలో అదే పరుగుల ఘనతను మెకల్లమ్ సాధించాడు. అయితే ట్వంటీ 20 ల్లో టాప్ స్కోరర్ రికార్డు క్రిస్ గేల్ (175*) పేరిట ఉంది.
గురువారం నార్తాంప్టన్‌షైర్ తో జరిగిన మ్యాచ్ లో ఆడమ్ చెలరేగి ఆడాడు. 73 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. దాంతో యార్క్షైర్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. అయితే వరల్డ్ రికార్డుకు యార్క్షైర్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మరో నాలుగు పరుగులు చేసుంటే ట్వంటీ 20 ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా యార్క్షైర్ నిలిచేది. గతేడాది సెప్టెంబర్ లో శ్రీలంకతో జరిగిన ఆస్ట్రేలియా చేసిన 263 పరుగులే ట్వంటీ 20 ఫార్మాట్ లో అత్యధిక స్కోరు.