కతునాయకే: శ్రీలంక మహిళలతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ ఓటమి లేకుండా ముగించింది. సోమవారం జరిగిన నాల్గో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళలు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సైతం అదే జోరు కనబర్చారు. కనీసం చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న ఆతిథ్య శ్రీలంకకు భారత్ మరోసారి చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, లంక మహిళలు 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలారు. పూనమ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, రాధా యాదవ్, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. దాంతో భారత్ 51 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 4-0 తో ‘స్వీప్’ చేసింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా, మిగతా వాటిలో భారత్ విజయ ఢంకా మోగించింది.
తాజా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 18.3 ఓవర్లలో 156 పరుగులు చేశారు. ఓపెనర్లు మిథాలీ రాజ్(12), స్మృతీ మంధాన(0) నిరాశపరిచినప్పటికీ, జెమీమా రోడ్రిగ్స్(46) మరోసారి ఆకట్టుకున్నారు. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప‍్రీత్ కౌర్(63;38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment