ధోని మెరిసినా...
⇒ జార్ఖండ్‌కు తప్పని ఓటమి
⇒ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో బెంగాల్
న్యూఢిల్లీ: తన నాయకత్వంలో జార్ఖండ్ జట్టును తొలిసారి విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చాలని ఆశించిన భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనికి నిరాశ ఎదురైంది. బెంగాల్ జట్టుతో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోని (62 బంతుల్లో 70; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో జార్ఖండ్‌కు ఓటమి తప్పలేదు. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని బెంగాల్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. బెంగాల్ ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (121 బంతుల్లో 101; 7 ఫోర్లు, ఒక సిక్స్), శ్రీవత్స్ గోస్వామి (99 బంతుల్లో 101; 11 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించారు.
వీరిద్దరు అవుటయ్యాక బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారి (49 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. దాంతో బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 329 పరుగుల భారీ స్కోరు సాధించింది. 330 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ సరిగ్గా 50 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. 100 పరుగులలోపే మూడు వికెట్లు కోల్పోయిన జార్ఖండ్‌ను గట్టెక్కించాలని సౌరభ్ తివారి (57 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాంక్ జగ్గీ (43 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధోని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏడు బంతుల తేడాలో ఇషాంక్, ధోని అవుటవ్వడంతో జార్ఖండ్ విజయంపై ఆశలు వదులుకుంది. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (5/70) ఐదు వికెట్లు తీసి బెంగాల్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. సోమవారం జరిగే ఫైనల్లో తమిళనాడుతో బెంగాల్ తలపడుతుంది.
అభిమానుల అత్యుత్సాహం...
విదర్భతో స్థానిక ఏయిర్‌ఫోర్స్ మైదానంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి ధోని కాళ్లకు నమస్కారం చేయడంతోపాటు అతడి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అలాంటి దృశ్యమే పునరావృతమైంది. ఈసారి ఇద్దరు అభిమానులు గ్రౌండ్‌లోకి వచ్చి ధోనికి పాదాభివందనం చేసి వెళ్లిపోయారు.