ఆస్ట్రేలియాకు ఊహించని షాక్
దుబాయ్: టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు మరో షాక్ తగిలింది. తమ ప్రమేయం లేకుండానే టెస్టు ర్యాంకుల్లో కంగారూల జట్టు మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా టీమ్ రెండో ర్యాంకుకు ఎగబాకింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ 1-1తో డ్రా కావడంతో సఫారీలకు రెండో స్థానం దక్కింది.
చివరి టెస్టులో ఆఖరిరోజు ఆటకు వరుణుడు అడ్డుపడడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. సఫారీల ఓటమి ఖాయమనుకున్న దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు. చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించివుంటే దక్షిణాఫ్రికా మూడో ర్యాంకులోనే కొనసాగేది. వర్షం రూపంలో ఆ జట్టుకు కలిసొచ్చింది. 109 రేటింగ్ పాయింట్లతో సఫారీ టీమ్ రెండో స్థానానికి చేరుకుంది. ఒక పాయింట్ తేడాతో ఆస్ట్రేలియా రెండో ర్యాంకు కోల్పోయింది. ఆసీస్ 108 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 122 రేటింగ్ పాయింట్లతో భారత్ టాప్ ర్యాంకులో కొనసాగుతోంది.
ర్యాంకుతో పాటు సొమ్ములను స్మిత్ సేన కోల్పోయింది. రెండో ర్యాంకులో ఉన్న జట్టుకు 5 లక్షల డాలర్లు, మూడో స్థానంలో ఉన్న టీమ్ కు 2 లక్షల డాలర్లు దక్కుతాయి. ర్యాంకు పతనంతో ఒక్క రోజు తేడాలో ఆసీస్ జట్టుకు 3 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందన్న మాట.