మరో ‘గోడ’లా... | Ajinkya Rahane the go-to man, does it again | Sakshi
Sakshi News home page

మరో ‘గోడ’లా...

Published Sun, Dec 6 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

మరో ‘గోడ’లా...

మరో ‘గోడ’లా...

 15, 2, 13, 9... నాలుగో టెస్టుకు ముందు అజింక్య రహానే దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో చేసిన పరుగులు ఇవి. అయితే ఏ క్రికెటర్‌కైనా ఫామ్ శాశ్వతం కాదని, క్లాస్ శాశ్వతమని రహానే మరోసారి నిరూపించాడు. కోట్లా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపికకు నిర్వచనంలా క్రీజులో నిలబడి భారత్‌ను శాసించే స్థితిలో నిలబెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరీయే అమోఘమైతే... రెండో ఇన్నింగ్స్‌లో అతని బ్యాటింగ్ ఇంకా అద్భుతం. రహానే ఆడిన చాలా షాట్లు... తన టెక్నిక్ ద్రవిడ్‌ను గుర్తు చేశాయి.

 తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే క్రమంలో అతనికి ఓ లైఫ్ లభించింది.  నిజానికి ఆ ఒక్కటి మినహాయిస్తే అతని ఆటతీరు లో వంక పెట్టడానికి లేదు. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్‌ల మీద సహనంతో ఆడాలి. పరుగులు రాకపోయినా... చెత్త బంతి పడేవరకూ ఓపికగా ఎదురు చూడాలి. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు మోర్కెల్, అబాట్ వైవిధ్యంగా బంతులు వేశారు. ఇక స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించారు. అయితే మిగిలిన భారత బ్యాట్స్‌మెన్‌లా కాకుండా... తాను చాలా అద్భుతంగా ఆడాడు. ఎక్కడ దూకుడు చూపించాలో అక్కడ వేగంగా ఆడాడు. ఎక్కడ తగ్గాలో అక్కడ నెమ్మదిగా ఆడాడు. అందుకే ఓ క్లాసిక్ సెంచరీ చేసి చూపించాడు.
 
 ఇక రెండో ఇన్నింగ్స్‌లో రహానే క్రీజులోకి వచ్చిన సమయంలో భారత్ 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. మోర్నీ మోర్కెల్ బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. ఓ ఎండ్‌లో కెప్టెన్ కోహ్లి బాగానే ఆడుతున్నా... ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ దశలో భారత్ మరో వికెట్ కోల్పోతే ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేరు. నిజానికి అప్పటికే భారత్‌కు ఆధిక్యం బాగా ఉంది. అయితే కచ్చితంగా మ్యాచ్ గెలిచే ఆధిక్యం మాత్రం కాదు. ఇలాంటి స్థితిలో క్రీజులోకి వచ్చిన రహానే... అమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.  కట్, డ్రైవ్, గ్లాన్స్... ఇలా అన్ని రకాల షాట్లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టిన రహానే... రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకూ ఐదు బౌండరీలే సాధించాడు. ఓ మంచి భాగస్వామ్యం ఉంటే దక్షిణాఫ్రికా నుంచి మ్యాచ్‌ను దూరం చేయొచ్చు. కోహ్లితో కలిసి రహానే ఇదే చేశాడు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న పిచ్‌పై సెంచరీ భాగస్వామ్యంతో జట్టును డ్రైవర్ సీట్‌లోకి తీసుకెళ్లాడు.
 
 ఈ ఇన్నింగ్స్‌తో ఊరట
 2013లో ఢిల్లీలోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన రహానే... ఈ సిరీస్‌కు ముందు భారత్‌లో మరో టెస్టు మ్యాచ్ ఆడలేదు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నాలుగు దేశాల్లో నాలుగు రకాల వైవిధ్యాలతో ఉండే పిచ్‌ల మీద ఆడాడు. ఏ సిరీస్‌లోనూ అతను నిరాశపరచలేదు. ఒక్క దక్షిణాఫ్రికాలో మినహాయిస్తే మిగిలిన మూడు దేశాల్లోనూ సెంచరీలు చేశాడు. సఫారీ గడ్డ మీద కూడా ఒకే మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు (అందులో ఒకటి 96 పరుగులు) చేశాడు. దీంతో రహానే భారత టెస్టు లైనప్‌లో డిపెండబుల్ ఆటగాడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌కు ముందు శ్రీలంకలోనూ శతకం చేసిన ఈ ముంబై క్రికెటర్... దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై నిరాశపరిచాడు.
 
 ఇది తనని కూడా బాధించే అంశమే. చాలామంది ఉపఖండం ఆటగాళ్లు క్రీజులో నిలబడటానికి కూడా భయపడే చోట మంచినీళ్ల ప్రాయంలా పరుగులు చేసిన క్రికెటర్... సొంతగడ్డపై సరిగా ఆడకపోవడం నిరాశ కలిగించే అంశం. దక్షిణాఫ్రికాతో ప్రస్తుత టెస్టులో ఆడిన రెండు ఇన్నింగ్స్ ద్వారా తనలో టెంపర్‌మెంట్‌ను బయటపెట్టిన రహానే... కచ్చితంగా ఊరట పొంది ఉంటాడు. ఇకపై ఏ దేశంలో, ఎలాంటి వికెట్‌పై టెస్టు ఆడాల్సి వచ్చినా... రహానే ఉన్నాడంటే కెప్టెన్ గుండెమీద చేయి వేసుకుని కూర్చోవచ్చు. అలాంటి ధీమాను తను పెంచాడు. -సాక్షి క్రీడావిభాగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement