'అకాడమీ పేరుతో అజ్మల్ దగా చేశాడు'
కరాచీ:అనుమానస్పద బౌలింగ్ తో అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన పాకిస్తాన్ స్పిన్నర్ సయిద్ అజ్మల్ అకాడమీ పేరుతో మోసం చేశాడని ఫైసలాబాద్ అగ్రికల్చర్ యూనివర్శిటీ నిర్వహణ శాఖ ఆరోపించింది. ఉచితంగా కోచింగ్ ఇస్తానని ప్రకటించిన అజ్మల్.. దాదాపు అందులో చేరిన వారందరి దగ్గర్నుంచీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొంది. ఈ అకాడమీకి సంబంధించి గత సంవత్సర కాలంగా యూనివర్శిటీ యాజమాన్యానికి, అజ్మల్ కు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత కాలం క్రితం అజ్మల్ అకాడమీని మూసేశాడు.
కాగా, ఆ అకాడమీలో 350 మంది విద్యార్థులను సభ్యులుగా చేర్చుకుని పదిహేను వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు యూనివర్శిటీ పరిపాలన శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఈ రూపంలో రూ.50 లక్షలను వసూలు చేశాడని తెలిపింది. ఉచితంగా క్రికెట్ అకాడమీని విస్తరించేందుకు యూనివర్శిటీ స్థలాన్ని అజ్మల్ కు ఇస్తే విద్యార్థులను దగా చేయడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయమని ఆదేశించినట్లు యూనివర్శిటీ నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు. ఒక సమయంలో స్థలాన్ని బలవంతంగా ఆక్రమించుకోవాలని అజ్మల్ తీవ్ర యత్నాలు చేశాడన్నారు.
ఇదిలా ఉండగా, గత నెలలోనే ప్రభుత్వం చొరవతో ఆ వివాదం సద్దుమణిగిందని, దీనిలో భాగంగా ఫైసలాబాద్ కమిషనర్ను, అకాడమీ సంబంధిత అధికారుల్ని కూడా పలుమార్లు కలిసిట్లు అజ్మల్ పేర్కొన్నాడు. తమ మధ్య తిరిగి అకాడమీని తెరిచేందుకు ఒప్పందం కుదిరిన తరువాత యూనివర్శిటీ అధికారులు ఇలా వ్యవహరించడం తగదన్నాడు. అకాడమీని నిర్మించడానికి సొంత డబ్బులు ఖర్చు చేసినట్లు అజ్మల్ పేర్కొన్నాడు.