బీసీసీఐ హస్తం లేదు:అక్రం
కరాచీ: వచ్చే ప్రపంచకప్ నుంచి సయీద్ అజ్మల్ తప్పుకోవడం వెనుక బీసీసీఐ హస్తముందన్న ఆరోపణలను పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మహ్మద్ అక్రం ఖండించారు. తన సందేహాస్పద బౌలింగ్ శైలిని ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపర్చుకోలేదనే అభిప్రాయంతోనే అజ్మల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు. ‘ప్రపంచకప్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం పూర్తిగా అజ్మల్ తీసుకున్నాడు. ప్రస్తుత బౌలింగ్ శైలి అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు అనుగుణంగా లేదనే అభిప్రాయంతో అతను ఉన్నాడు. అంతేకానీ ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ప్రపంచకప్‌తోనే అంతా అయిపోయినట్టు కాదు. ఇంకా చాలా క్రికెట్ ఉంది. ఇది అర్థం చేసుకునే అజ్మల్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు’ అని అక్రం స్పష్టం చేశారు.
మరోవైపు అజ్మల్ తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ స్విట్జర్లాండ్‌లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్)లో కేసు దాఖలు చేయాలని పాక్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ సలహా ఇచ్చాడు. శారీరక వైకల్యం కారణంగానే అజ్మల్ బౌలింగ్ చేస్తున్నపుడు తన చేయిని 15 డిగ్రీలకంటే ఎక్కువగా వంచుతున్నాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.