బాయ్ కాట్ చేయొద్దు: అక్రమ్
కరాచీ: పాకిస్థాన్ తో జరగాల్సిన ద్వైపాకిక్ష సిరీస్ పై ఇంకా సందిగ్థత వీడని నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్ లో జరుగనున్న ట్వంటీ 20 వరల్డ్ కప్ టోర్నీని బహిష్కరించే ఆలోచనకు పీసీబీ దూరంగా ఉండాలని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సూచించాడు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సిరీస్ జరిగే పరిస్థితులు లేకపోయినా, త్వరలో జరిగే అవకాశం ఉందని అక్రమ్ తెలిపాడు. 'ఇరు దేశాల ద్వైపాకిక్ష క్రికెట్ సిరీస్ పై భారత్ చాలా సమయం తీసుకుంది. అయినా ఇంకా స్పష్టత లేదు. ఆ సిరీస్ ఇప్పుడు జరగకపోయినా, త్వరలో జరుగుతుంది. ఆ సిరీస్ కు ఇంకా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆ దేశంలో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ ను మాత్రం బహిష్కరించవద్దు' అని అక్రమ్ తెలిపాడు.
వరల్డ్ కప్ ఈవెంట్ అనేది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి సంబంధించినది కాబట్టి పాకిస్థాన్ ముందస్తు జాగ్రత్త వహిస్తే మంచిదన్నాడు. భారత్ లో జరిగే ఆ టోర్నీకి పాకిస్థాన్ వెళ్లకపోతే.. మన క్రికెట్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. ఒకవేళ మనతో భారత్ ఆడకపోతే వారికి జరిగే నష్టం పెద్దగా ఉండదని.. కేవలం కొంత జరిమానాతో మాత్రమే భారత్ తన సమస్య నుంచి బయటకొస్తుందని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ తో సిరీస్ ఆడినా, ఆడకపోయినా ఉగ్రవాదం అనేది సమస్యకు పరిష్కారం దొరకదన్నాడు. ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి భారత్ ఒక వివరణ ఇస్తే బాగుంటుందని అక్రమ్ విజ్ఞప్తి చేశాడు. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు వకార్ యూనస్- మహ్మద్ యూనస్ ఖాన్ ల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని వారిద్దరూ కూర్చుని పరిష్కరించుకుంటే మంచిదని అక్రమ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.