
అక్కడ అలెస్టర్ కుక్ లేకపోతే..!
లండన్: అలెస్టర్ కుక్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లండ్ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన క్యాచ్లు అతని సొంతం.ప్రత్యేకంగా స్లిప్ క్యాచ్లను అందుకోవడంలో కుక్ దిట్టనే చెప్పొచ్చు. అయితే తాజాగా అలెస్టర్ కుక్ మరోసారి తన మెరుగు ఫీల్డింగ్ తో తానేమిటో నిరూపించుకున్నాడు. నమ్మశక్యం కాని రీతిలో కుక్ పట్టిన క్యాచ్ అతని పాత రోజుల్ని గుర్తు చేసింది. అది కూడా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుండగా రయ్ మంటూ దూసుకొచ్చిన బంతిని కుక్ అద్భుతంగా అందుకోవడం ఇక్కడ విశేషం.
ఇటీవల కౌంటీ క్రికెట్ లో భాగంగా ఇంగ్లండ్లోని ఒక స్థానిక గ్రౌండ్లో ఎసెక్స్ బ్యాట్స్మన్ అయిన కుక్ ను ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అదే సమయంలో పక్కనే ప్రాక్టీస్ చేస్తున్న యువకుడు బంతిని హిట్ చేశాడు. ఆ బంతి ఇంటర్య్వూ చేస్తున్న వ్యక్తిపై దూసుకొచ్చింది. దీనికి అంతే వేగంగా స్పందించిన కుక్..ఆ బంతిని చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. బంతిని హిట్ చేసిన వ్యక్తి అరవడంతో కుక్ వేగంగా స్పందించి క్యాచ్ ను అందుకున్నాడు. ఒకవేళ అక్కడ కుక్ లేకపోయి ఉంటే ఇంటర్య్వూ చేసే వ్యక్తికి ఆ బంతి బలంగా తాకేది. ఈ ఘటనకు సంబంధించి కుక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని ప్రాణాన్ని కుక్ కాపాడంటూ పలువురు నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.