బర్మింగ్‌హమ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్స్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 18 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా తెరదించుతారని భావిస్తే అలాంటిదేమీ జరగలేదు. మనోళ్లందరూ కనీసం క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయారు. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. 2015లో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ నంబర్‌వన్, చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. 37 నిమిషాల్లోనే ముగిసిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 15–21, 19–21తో టాప్ సీడ్ తై జు యింగ్ చేతిలో ఓటమి చవిచూసింది.
గతేడాది ఇదే టోర్నీ తొలి రౌండ్‌లో తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది వరుసగా 13వసారి కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ చైనీస్ తైపీ చేతిలో ఆమెకిది 15వ ఓటమి. 2013లో స్విస్ ఓపెన్‌లో చివరిసారి తై జు యింగ్‌పై గెలిచిన సైనా ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణిని ఓడించలేకపోయింది.
భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 16–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మొమోటా చేతిలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్‌కిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. వాంతులు, విరేచనాలతో బాధపడ్డాను. కడుపులో నొప్పి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌లు ఆడి గెలవగలిగాను. తై జు యింగ్‌తో పదే పదే ఆడటం మంచిదే. ఆమెను ఎలా ఓడించాలనే విషయం నేర్చుకోవాల్సి ఉంది.
సైనా నెహ్వాల్
Comments
Please login to add a commentAdd a comment