మాజీల మెరుపులు...
ఆల్ స్టార్స్ మ్యాచ్‌లో ‘వార్న్’ వారియర్స్ ఘన విజయం
ఆరు వికెట్ల తేడాతో ఓడిన సచిన్‌సేన
వీరేంద్ర సెహ్వాగ్ జోరు వృథా
11న రెండో మ్యాచ్
అదే జోరు.. అవే షాట్లు.. అదే ఊపు... వయసు పైబడినా.. ఆటలో పదును మాత్రం ఇంకా తగ్గలేదు.. స్టార్ల నుంచి దిగ్గజాలుగా మారినా... కొట్టే షాట్లలో మాత్రం మార్పు రాలేదు... ఇప్పటికీ కుర్రాళ్లకు తీసిపోమనే విధంగా ‘క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్’లో ప్రపంచ మాజీలు చేసిన బ్యాటింగ్ విన్యాసాలకు అమెరికా అభిమానులు ముగ్దులయ్యారు. చూడ ముచ్చటైన కవర్ డ్రైవ్‌లు... తమకు మాత్రమే సాధ్యమయ్యే స్ట్రయిట్ డ్రైవ్‌లు... అప్పర్ కట్స్.. స్వీప్‌లు.. లాంగాన్ షాట్స్‌తో దుమ్మురేపడంతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో వార్న్ వారియర్స్... సచిన్ సేనపై ఘన విజయం సాధించింది.
న్యూయార్క్: ఆటకు దూరమైనా... తన స్పిన్ మ్యాజిక్‌ను మాత్రం మర్చిపోలేదని ఆసీస్ బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ (3/20) నిరూపించుకున్నాడు. గింగరాలు తిరిగే బంతులతో కీలక వికెట్లు పడగొట్టాడు. వార్న్‌కు తోడు సైమండ్స్ (3/15), రికీ పాంటింగ్ (38 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సంగక్కర (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరు చూపెట్టడంతో... క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో వార్న్ వారియర్స్ 6 వికెట్ల తేడాతో సచిన్స్ బ్లాస్టర్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సచిన్స్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. సెహ్వాగ్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సచిన్ (27 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. తర్వాత వార్న్ వారియర్స్ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 141 పరుగులు చేసింది. వార్న్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వార్న్ వారియర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్ ఈనెల 11న హూస్టన్‌లో జరుగుతుంది.
వీరూ... జోరు
సచిన్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన సెహ్వాగ్ వీరవిహారం చేశాడు. అక్రమ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా తొలి బౌండరీ సాధించిన వీరూ ఆ తర్వాత సిక్సర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. డొనాల్డ్, కలిస్ ఓవర్లలో షార్ట్ బంతులను లాంగాన్, ఆన్‌సైడ్‌లో భారీ షాట్లుగా మలిచాడు. వాల్ష్ వేసిన ఏడో ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన వార్న్ ఆఖరి బంతికి సచిన్‌ను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్ తొలి బంతికి సెహ్వాగ్ జోరుకు వెటోరి కళ్లెం వేశాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 85 పరుగులు జత చేశారు. తర్వాత వార్న్.. వరుస ఓవర్లలో బ్రియాన్ లారా (1), వీవీఎస్ లక్ష్మణ్ (8)లను పెవిలియన్‌కు చేర్చడంతో బ్లాస్టర్స్ జట్టు 97 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హూపర్ (11), జయవర్ధనే (18) ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా.. సైమండ్స్ స్లో బౌలింగ్‌లో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. 16వ ఓవర్‌లో జయవర్ధనేను అవుట్ చేసిన సైమండ్స్... 18వ ఓవర్‌లో నాలుగు బంతుల వ్యవధిలో హూపర్, మొయిన్ ఖాన్ (1)ను అవుట్ చేయడంతో బ్లాస్టర్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
పాంటింగ్ అదుర్స్..
లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్... మూడో ఓవర్‌లోనే ఓపెనర్లు కలిస్ (13), హెడెన్ (4)ల వికెట్లను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో పాంటింగ్, సంగక్కరలు మంచి సమన్వయంతో ఆడారు. అంబ్రోస్ బౌలింగ్‌లో సంగ రెండు సిక్సర్లు బాది రన్‌రేట్‌ను పెంచాడు. పాంటింగ్ కూడా పొలాక్, మురళీధరన్‌లకు సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించాక.. అక్తర్ బౌలింగ్‌లో సంగక్కర అవుటయ్యాడు. తర్వాతి ఓవర్‌లో సైమండ్స్ (1) వెనుదిరిగినా... పాంటింగ్, జాంటీ రోడ్స్ (14 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) దుమ్మురేపారు. 21 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సమకూర్చడంతో వారియర్స్ మరో 16 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అక్తర్‌కు 2 వికెట్లు పడ్డాయి.
►సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్‌కు వస్తుంటే ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లింది. ‘సచిన్, సచిన్, వీరూ, వీరూ’ అంటూ మైదానంలో ప్రేక్షకులు గొంతు కలిపారు.
►న్యూయార్క్‌లోని సిటీ ఫీల్డ్ బేస్‌బాల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు దాదాపు 36 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
►వివిధ దేశాల జాతీయ పతాకాలతో అభిమానులు ఆటగాళ్లకు మద్దతు తెలిపారు. భారత జాతీయ జెండా రంగులను ముఖానికి పూసుకుని, టీమిండియా టీ షర్ట్‌లను ధరించి చాలా మంది హాజరయ్యారు.
► సచిన్ మా దేవుడు, అధ్యక్షుడు అంటూ రకరకాల బ్యానర్లతో స్టేడియం నిండిపోయింది. చాలా మంది ఇతర దేశాల టీ షర్ట్‌లను కూడా ధరించి మద్దతు తెలిపారు.
స్కోరు వివరాలు
సచిన్స్ బ్లాస్టర్స్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) వెటోరి 55; సచిన్ (సి) కలిస్ (బి) వార్న్ 26; లక్ష్మణ్ (స్టంప్డ్) సంగక్కర (బి) వార్న్ 8; లారా ఎల్బీడబ్ల్యు (బి) వార్న్ 1; జయవర్ధనే సబ్ (సి) అగర్కార్ (బి) సైమండ్స్ 18; హూపర్ ఎల్బీడబ్ల్యు (బి) సైమండ్స్ 11; పొలాక్ (సి) కలిస్ (బి) డొనాల్డ్ 11; మొయిన్ ఖాన్ (సి) కలిస్ (బి) సైమండ్స్ 1; ఆంబ్రోస్ నాటౌట్ 1; మురళీధరన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1-85; 2-85; 3-88; 4-97; 5-118; 6-127; 7-130; 8-137.
బౌలింగ్: అక్రమ్ 4-0-16-0; డొనాల్డ్ 3-0-23-1; వాల్ష్ 2-0-30-0; కలిస్ 1-0-19-0; వార్న్ 4-0-20-3; వెటోరి 4-0-13-1; సైమండ్స్ 2-0-15-3.
వార్న్ వారియర్స్ ఇన్నింగ్స్: కలిస్ రనౌట్ 13; హెడెన్ (సి) మొయిన్ (బి) అక్తర్ 4; పాంటింగ్ నాటౌట్ 48; సంగక్కర (సి) జయవర్ధనే (బి) అక్తర్ 41; సైమండ్స్ ఎల్బీడబ్ల్యు (బి) మురళీధరన్ 1; రోడ్స్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (17.2 ఓవర్లలో 4 వికెట్లకు) 141.
వికెట్ల పతనం: 1-20; 2-22; 3-102; 4-104.
బౌలింగ్: అక్తర్ 4-0-26-2; పొలాక్ 3-0-30-0; అంబ్రోస్ 3-0-36-0; మురళీధరన్ 4-1-18-1; హూపర్ 3-0-20-0; సచిన్ 0.2-0-7-0.