
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో బాక్సింగ్‌లో భారత్ పంచ్ అదిరింది. శనివారం జరిగిన పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు.
ఫలితంగా భారత్ పతకాల సంఖ్య 67కు చేరింది. దాంతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలను సాధించినట్లయ్యింది. 2010 గ్వాంగ్‌జూ ఏషియాడ్‌లో భారత్ అత్యధికంగా 65 పతకాలు సాధించగా... జకార్తా క్రీడల్లో ఆ రికార్డు కూడా తెరమరుగైంది. ఇప్పటివరకూ భారత్ 15 స్వర్ణ పతకాలు, 23 రజతాలు, 29 కాంస్యాలను సాధించింది. అంతకుముందు జరిగిన బ‍్రిడ్జ్ ఈవెంట్‌లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్‌లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment