
'ఆమ్లా ఫామ్ పైనే ఆందోళన'
ముంబై: గత కొంతకాలంగా విఫలం చెందుతున్న తమ స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఫామ్ పైనే ఆందోళనగా ఉందని దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రస్సెల్ డొమినిగో తెలిపాడు. తొలి టెస్టు ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆమ్లా ఒక పరుగు మాత్రమే చేసి మరోసారి విఫలం కావడం కలవరపెడుతుందన్నాడు. అయితే ఆమ్లా ఒక భారీ ఇన్నింగ్స్ తో తిరిగి గాడిలో పడతాడని డొమినిగో ఆశాభావం వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికా- బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన అనంతరం డొమినిగో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. గత ఎనిమిది మ్యాచ్ ల నుంచి ఆమ్లా ఒక సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేదన్నాడు. భారత్ లో జరిగిన ట్వంటీ 20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో కూడా ఆమ్లా వైఫల్యం చెందడమే జట్టులో ఆందోళన కల్గిస్తుందన్నాడు. నవంబర్ ఐదో తేదీ నుంచి మొహాలీలో జరిగే తొలి టెస్టులో పిచ్ పెద్దగా టర్న్ కాకపోవచ్చన్నాడు. ప్రస్తుతం తమ జట్టులోని ఆటగాళ్లంతా టెస్టు మ్యాచ్ లకు సిద్ధంగా ఉన్నా.. పిచ్ ను చూసిన తరువాతే జట్టు ఎంపిక జరుగుతుందన్నాడు.