అమూల్య డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ బ్యాడ్మిం టన్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ పాఠశాలకు చెందిన అమూల్య సత్తా చాటింది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో అమూల్య అండర్–19, అండర్–17 బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ ఫైనల్లో అమూల్య 30–12తో ప్రియ (డీపీఎస్)పై, అండర్–17 విభాగంలో 30–24తో సౌమ్య వ్యాస్ (వీజీఎస్)పై విజయం సాధించింది. అండర్–14 బాలికల ఫైనల్లో జి. సంజన (ఒయాసిస్) 30–26తో సౌమ్య వ్యాస్‌పై, అండర్–10 విభాగంలో షగుణ్ (ఇండస్) 30–26తో సృష్టి (ఇండస్)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు.
మరోవైపు బాలుర విభాగంలో బి. రాజేశ్, కె. శ్రీనివాస్, శశాంక్, గౌతమ్‌లు టైటిళ్లను గెలుచుకున్నారు. అండర్–19 సిం గిల్స్ ఫైనల్లో బి. రాజేశ్ 30–24తో సిద్ధాంత్ (డీపీఎస్)పై, అండర్–17 కేటగిరీలో కె. శ్రీనివాస్ 30–20తో టి. శ్రీజిత్ (జీవీఎస్)పై, అండర్– 14 విభాగంలో శశాంక్ సాయి (జేహెచ్‌పీఎస్) 30–23తో ఆర్. ధరన్ కుమార్‌పై, అండర్–10 కేటగిరీలో గౌతమ్ (డీపీఎస్) 30–26తో సార్థక్ (ఎపిస్టిమ్ గ్లోబల్ స్కూల్)పై గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు బి. సాయి ప్రణీత్, బి. సుమీత్ రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.